కాళేశ్వరానికి రిపేర్లు చేద్దాం.. ఎంత ఖర్చవుతుందో లెక్కకట్టండి: సీఎం రేవంత్

కాళేశ్వరానికి రిపేర్లు చేద్దాం.. ఎంత ఖర్చవుతుందో లెక్కకట్టండి: సీఎం రేవంత్
  • ఇరిగేషన్​ అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం
  • ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్ట్  ఆధారంగా రిపేర్లు
  • రెండు మూడు రోజుల్లో లెక్క తేల్చి నిర్మాణ సంస్థకు పనులు అప్పగించే చాన్స్​
  • నిర్మాణ సంస్థతోనే ఖర్చు పెట్టించాలని నిర్ణయం
  • తప్పు ఎవరు చేసినా పబ్లిక్ కోణంలోనే ముందుకెళ్లాలని చెప్పిన సీఎం

హైదరాబాద్​, వెలుగు: డ్యామేజీ అయిన కాళేశ్వరం రిజర్వాయర్లకు రిపేర్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. నేషనల్​ డ్యామ్​ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్​ఏ) ఇచ్చిన మధ్యంతర నివేదికలోని రికమండేషన్స్​ ఆధారంగా రిపేర్లు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నది. రిపేర్ల కోసం ఎంత ఖర్చు అవుతుందో లెక్క గట్టాలని ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​ అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఎన్డీఎస్​ఏ రికమండేషన్స్​ ఏమున్నాయి? ఎవరెవరు ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది ? దేనికెంత ఖర్చు అవుతుందనే దానిపై రెండు, మూడు రోజుల్లో రిపోర్ట్​ రెడీ చేసి ఇవ్వాలని ఇరిగేషన్​ ఆఫీసర్లను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. రిపేర్లకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థతోనే పెట్టించాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఎవరి నిర్లక్ష్యంతో తప్పు జరిగినప్పటికీ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల కోణంలో ఉంటాయే తప్ప పొలిటిల్​ ఇష్యూస్​తో ముడిపడి ఉండవని, అధికారులు కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఎన్డీఎస్​ఏ రికమండేషన్స్​ ఆధారంగా వీలైనంత త్వరగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ప్రభుత్వం రిపేర్లు చేయాలనుకుంటున్నది. 

రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థకే

కాళేశ్వరం ప్రారంభించిన తర్వాత వచ్చిన మొదటి వరదకే మేడిగడ్డ ఏడో బ్లాక్​లో సమస్యలు తలెత్తాయని ఎన్డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ తెలిపింది. అంటే 2019లో డ్యామేజీ జరిగింది. వాటిని అప్పుడే గుర్తించి రిపేర్లు చేపట్టి ఉంటేం మిగతా పిల్లర్లకు సమస్యలు వచ్చేవి కాదని ఎన్డీఎస్​ఏ పేర్కొంది.  ఆ సమయంలో బ్యారేజీ డిఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లయబిలిటీ కాలంలో ఉన్నందున పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థే తీసుకోవాల్సి ఉంటుంది. రిపేర్లకు సంబంధించిన ఖర్చుల అంశాన్ని కూడా ఎన్డీఎస్​ఏ సిఫార్సుల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థతో చర్చించింది. అవసరమైన ఖర్చులు భరించాల్సి ఉంటుందని చెప్పగా.. అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఎన్డీఎస్​ఏ రికమండేషన్స్​ రావడంతో.. వాటికి తగ్గట్టుగా రిపేర్లు చేయనున్నారు. ఇందుకోసం ఎవరెవరు, ఎక్కడ, ఏమి పనిచేయాలనే దానిపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. ఎంతవరకు రిపేర్లు చేయగలరు ? చేసిన తర్వాత కూడా మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటే ఎలా అనే దానిపైనా ఇంజనీర్ల బృందం ప్రభుత్వానికి నివేదించనుంది. కాగా, మాన్​సూన్​ త్వరగా వస్తే అంత తొందరగా పనులు పూర్తి చేయగలమా అన్న సందేహాన్ని ఇంజనీర్లు వ్యక్తం చేస్తున్నారు. మాన్​సూన్​కు ఇంకా మూడు వారాలు మాత్రమే ఉండటంతో.. టైం బాండ్​ పెట్టుకుని ఎంతవరకు అయితే అంత వరకు పనులు కంప్లీట్​ చేసే యోచనలో ఉన్నారు. ఇక, మాన్​సూన్​తో సంబంధం లేకుండా చేసే రిపేర్లు ఏమున్నాయో వాటిని గుర్తించి పనులు చేపట్టనున్నారు. ఒక్క బ్యారేజీ తర్వాత ఒక్కటి కాకుండా.. మూడింటిలో ఉన్న డ్యామేజీలకు ఒకేసారి రిపేర్లు  మొదలుపెట్టాలని భావిస్తున్నారు.