లష్కర్​ లడాయి గెలిచేదెవరు?

లష్కర్​ లడాయి గెలిచేదెవరు?
  • సిట్టింగ్​ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ పట్టు
  • విజయం తమదేనన్న ధీమాలో కాంగ్రెస్​
  • అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న: పద్మారావు

హైదరాబాద్, వెలుగు: కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో పార్టీలన్నీ ప్రచారాన్ని స్పీడప్ ​చేశాయి. అతి ముఖ్యమైన ‘లష్కర్​’లో పాగా వేసేందుకు కాంగ్రెస్,బీజేపీ, బీఆర్ఎస్​ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకుపోతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, వివిధ మతాల వారు కలిసి ఉండే ఈ నియోజకవర్గాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, మార్వాడీలు, 
గుజరాతీలు, రైల్వే ఓటర్లు ఇక్కడ కీలకంగా మారనున్నారు. ఈ ​పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో సికింద్రాబాద్​, సనత్​నగర్​, ఖైరతాబాద్​, ముషీరాబాద్​, అంబర్​పేట, జూబ్లీహిల్స్​, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 పార్లమెంట్​ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్​రెడ్డి విజయం సాధించారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. 

ఈసారి కూడా దేశవ్యాప్తంగా బీజేపీ హవా వీస్తోందని, తన విజయం తథ్యం అనే ధీమాలో ఆయన ఉన్నారు. అదే ఉత్సాహంతో అందరికంటే ముందే నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ​పార్టీ నుంచి ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్​ నుంచి సికింద్రాబాద్​ ఎమ్మెల్యే పద్మారావు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్​తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిందని, ఈసారి గెలుపు తనదేనని పద్మారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి పోటీలో ఉన్న ముగ్గురు కూడా ప్రజాప్రతినిధులే. కిషన్​రెడ్డి సిట్టింగ్ ​ఎంపీ కాగా, కాంగ్రెస్​ అభ్యర్థి దానం నాగేందర్​ ఖైరతాబాద్​ఎమ్మెల్యే, అలాగే బీఆర్ఎస్​ నుంచి పోటీ చేస్తున్న పద్మారావు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్​అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.  

మైనారిటీలు, మురికివాడల్లోని ఓట్లే కీలకం

లష్కర్​ పార్లమెంట్​ నియోజకవర్గం నుంచి విజయం సాధించాలంటే అత్యంత కీలకంగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్, మార్వాడీ, సిక్కు, గుజరాతీల ఓట్లతో పాటు అత్యధికంగా వున్న మురికివాడల్లోని ఓట్లు కూడా కీలకమే. సికింద్రాబాద్, సనత్​నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్​పేట, ముషీరాబాద్​తదితర నియోజకవర్గాల్లో మురికివాడలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముషీరాబాద్​, సికింద్రాబాద్​, ఖైరతాబాద్​, సనత్​నగర్​ నియోజకవర్గాల్లో ముస్లిం, క్రిస్టియన్​ ఓటర్లు అధికంగా ఉన్నారు. 21,11,224 మంది ఓటర్లలో దాదాపు 20 శాతం అంటే నాలుగు లక్షల వరకు మైనారిటీ ఓటర్లే ఉండడంతో వారి ఓట్లు గెలుపును నిర్ధేశించే స్థితిలో ఉన్నాయి. సనత్​నగర్​ నియోజక వర్గంలో మార్వాడీలు, గుజరాతీ, సిక్కు ఓటర్లు కీలకం కానున్నారు.

 సికింద్రాబాద్​ నియోజకవర్గంలోని రైల్వే ఓటర్లు కూడా అభ్యర్థుల గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్​రెడ్డి సమీప ప్రత్యర్థి తలసాని సాయికిరణ్​పై 62,114 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో 19,68,276 ఓటర్లుండగా గత ఎన్నికల్లో కిషన్​రెడ్డి 3,84,780 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ ​అభ్యర్థి తలసాని సాయికిరణ్​యాదవ్​ 3,22,666 ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్​ తరఫున పోటీ చేసిన మాజీ ఎంపీ అంజన్​కుమార్​ యాదవ్ 1,73,229 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.  

మోదీ చరిష్మా గెలిపిస్తుందన్న ధీమాతో కిషన్​రెడ్డి

పదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాల అమలుతో పాటు అయోధ్యలో రామమందిర నిర్మాణం, మోదీ ఛరిష్మా తనను గెలిపిస్తుందని కిషన్​రెడ్డి నమ్మకంతో ఉన్నారు. మళ్లీ గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తానంటూ చెప్తుండగా..కిషన్​రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన అంబర్​పేట అసెంబ్లీ నియోజక వర్గానికి చేసిందేమీ లేదన్న విమర్శులున్నాయి. కిషన్​రెడ్డి తమకు అందుబాటులో ఉండడం లేదని, పట్టించుకోవడం లేదని నియోజకవర్గంలోని పార్టీ కేడర్​అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్​ పార్లమెంట్​పరిధిలోని ఒక్క నియోజకవర్గంలోనూ బీజేపీని గెలిపించలేకపోయాడన్న అపవాదు ఉంది. ఈసారి నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి లేదని, క్రిస్టియన్లు కూడా బీజేపీ పట్ల పెద్దగా నమ్మకంతో లేరన్న వాదన వినిపిస్తోంది. అభ్యర్థి విజయం సాధించాలంటే కార్యకర్తలు, లీడర్ల పాత్ర కీలకం. కానీ, ఈసారి లష్కర్​ పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలోని చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీకి చెందిన సీనియర్ ​లీడర్లు, కార్యకర్తలు పెద్దగా కనిపించక పోవడం కిషన్​రెడ్డికి మైనస్​గా చెప్పవచ్చు.  

అధికారంలో ఉండడం కాంగ్రెస్​కు అడ్వాంటేజ్​ 

రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్​ అభ్యర్థిగా ఎమ్మెల్యే దానం నాగేందర్​ పోటీ చేయడంపై కొంతమంది నేతల్లో అసంతృప్తి ఉన్నా, ఎవరూ బయటపడడం లేదు. బీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్​లోకి రాగానే ఆయనకు ఖైరతాబాద్​టికెట్​ కేటాయించడం, తర్వాత సికింద్రాబాద్ ​పార్లమెంట్ ​టికెట్ ఇచ్చి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కొంత మంది లీడర్లు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

అయితే, ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రసంగాలు, కాంగ్రెస్ ​ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో వచ్చిన పాజిటివ్​ సిగ్నల్స్ ​దానం నాగేందర్​కు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అలాగే ముస్లిం, క్రిస్టియన్​ఓటర్లు ఖచ్చితంగా కాంగ్రెస్​వైపే ఉంటారని, దీంతో తమ గెలుపు నల్లేరు మీద నడక అన్న ధీమా ఆ పార్టీ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. మురికివాడల్లోని ఓటర్లు కాంగ్రెస్​కు అనుకూలంగా ఉన్నారన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఈసారి సికింద్రాబాద్​ పార్లమెంట్ ​స్థానం కాంగ్రెస్​దేనన్న వాదన ఆపార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే నియోజక వర్గంలోని సీనియర్లను కూడా కలుపుకుని పోతే నాగేందర్​కు మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందంటున్నారు.  

అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బీఆర్ఎస్​

గత పార్లమెంట్​ఎన్నికల్లో టఫ్ ​ఫైట్​ఇచ్చిన బీఆర్ఎస్​ఈసారి మాత్రం కొంత గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​...తన కొడుకు తలసాని సాయికిరణ్ ​యాదవ్​కు పట్టుబట్టి టికెట్​ఇప్పించుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే కష్టపడ్డా ఫలితం దక్కలేదు. ఈసారి బీఆర్ఎస్​ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, గత ఎన్నికల నాటి జోష్​ ఇప్పుడు కార్యకర్తల్లో కనిపించకపోవడం వారికి మైనస్. ఈసారి పోటీ చేసేందుకు తలసాని సాయికిరణ్​యాదవ్​ ముందుకు రాకపోవడంతో సికింద్రాబాద్​ఎమ్మెల్యే పద్మారావుపై పార్టీ అధిష్టానం ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆయన వస్తే ఎంపీ సీటు వస్తుంది లేకపోతే ఎమ్మెల్యే సీటు ఉంటుందని ఓకే చెప్పారు. ఇప్పటికే ఆయన దాదాపు నియోజకవర్గాన్ని చుట్టివచ్చారు. ఈసారి తన విజయం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. , ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్​ గెలుపు అంత సులుపు కాకపోవచ్చు.