వార్సా: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. గ్రాండ్ చెస్ టోర్నీలో తొలి విక్టరీని అందుకున్నాడు. సూపర్‌బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్‌లో భాగంగా తొలి రోజు జరిగిన మూడు గేమ్‌లను డ్రా చేసుకున్న అర్జున్ గురువారం మాత్రం విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఐదో రౌండ్‌లో అర్జున్.. కిరల్ షెవాంకో (రొమేనియా)ను ఓడించాడు. ఇక క్యాండిడేట్స్ చెస్ చాంపియన్ డి. గుకేశ్ వరుసగా రెండు విజయాలు సాధించాడు. నాలుగో గేమ్‌లో ప్రజ్ఞానందను ఓడించిన అతను ఐదో రౌండ్‌లో విన్సెంట్ కీమర్‌పై గెలిచాడు. ఆ వెంటనే ప్రజ్ఞానంద.. అనీష్ గిరి (నెదర్లాండ్స్)కు చెక్ పెట్టాడు. ఓవరాల్‌గా ఈ రౌండ్ తర్వాత అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద ఐదు పాయింట్లతో సంయుక్తంగా నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
