గండిపేట, వెలుగు: ఓ వివాహితను ప్రేమిస్తున్న యువకుడు.. సదరు యువతితో సన్నిహితంగా ఉంటున్న మరో యువకుడిని హత్య చేశాడు. శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వారం క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బోరబండకు చెందిన నాగలక్ష్మి(26) భర్తతో విడిపోయి దూరంగా ఉంటోంది. ఈమెతో మొయినాబాద్ మండలం వెంకటాపూర్ ప్రాంతానికి చెందిన జంపుల మహేశ్(24) సన్నిహితంగా ఉంటున్నాడు.
పరిగి మండలానికి చెందిన బాపురం రత్నం కొంత కాలంగా ప్రేమిస్తున్నానంటూ నాగలక్ష్మి వెంట పడుతున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు. మహేశ్‌తో మాట్లాడడం మానేయాలని, లేదంటే ఎంత దూరమైనా వెళ్తానని నాగలక్ష్మిని బెదిరించాడు. అన్నట్లుగా మహేశ్ హత్యకు ప్లాన్ చేశాడు. డిసెంబర్ 24న కవేలిగూడ గ్రామంలోని విన్ సిట్ వెంచర్లో గొడ్డలితో దాడి చేసి మహేశ్‌ను చంపేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
