ప్రకాశం బ్యారేజీ వద్ద టీచర్లను అడ్డుకున్న పోలీసులు

ప్రకాశం బ్యారేజీ వద్ద టీచర్లను అడ్డుకున్న పోలీసులు

బదిలీల ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఛలో సెక్రటేరియట్ కు భారీగా తరలివచ్చిన టీచర్లు

విజయవాడ: బదిలీల ప్రక్రియను వ్యతిరేకిస్తూ టీచర్లు చేపట్టిన ఛలో సెక్రటేరియట్ ఉద్రిక్తత సృష్టించింది. జిల్లాల నుండి వస్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలిసే హక్కు లేదా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల జులుం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.

తెల్లవారుజాము నుండే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ముఖ్య కార్యవర్గ సభ్యులు విజయవాడకు భారీగా తరలివచ్చారు. సొంత వాహనాల్లో వస్తుంటే అరెస్టు చేస్తున్నారని గుర్తించి చాలా మంది రైళ్లు.. బస్సుల్లో విజయవాడకు చేరుకున్నారు. వీరి రాకను ముందే గుర్తించిన పోలీసులు సెక్రటేరియట్ కు వెళ్లే దారుల్లో అనేక చోట్ల బ్యారికేడ్లు పెట్టారు.  టీచర్లను అడ్డుకునేందుకు  భారీగా మొహరించారు. ప్రకాశం బ్యారేజీ నుండి ముందుకు వెళ్లకుండా ఆపేయడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద చాలాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బ్యారేజీకి ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరి నిలిచిపోయాయి. నిరసనకారులను సెక్రటేరియట్ కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకుని తమ వాహనాల్లో గుర్తు తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లారు.  బదిలీలు చేపడితే పారదర్శకంగా ఉండాలని.. అడ్డగోలు నిబంధనలు పెట్టి ఖాళీలను బ్లాక్ చేయడం సరికాదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాప్టో తోపాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు  వెబ్ కౌన్సెలింగ్ ను రద్దు చేయాలని.. ఖాళీల బ్లాకింగ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.