20వ తేదీ లోపు కోర్టుకు రావాలి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి పోలీసుల నోటీసులు

20వ తేదీ లోపు కోర్టుకు రావాలి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి పోలీసుల నోటీసులు

హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‎లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు గురువారం (మే 22) నోటీసులు అంటించారు. 2025, జూన్ 20 లోపు కోర్టులో హాజరు కావాలని ప్రభాకర్ రావును నాంపల్లి కోర్టు ఆదేశించింది. 

హాజరు కాకుంటే అఫెండర్‎గా నాంపల్లి కోర్టు ప్రకటిస్తుందని హైదరాబాద్‎లో ప్రభాకర్ రావు ఇంటికి అంటించిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రభాకర్ రావును అఫెండర్‎గా పోలీసులు బహిరంగంగా అనౌన్స్ చేయనున్నారు. కాగా,  ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దర్యాప్తుకు హాజరవుతేనే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో అతడిని రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

Also Read : పోలీస్​శాఖలో భారీగా బదిలీలు

కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సెలబ్రెటీలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్ఐబీ మాజీ ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే విదేశాలకు పారిపోయాడు. 

ఈ క్రమంలోనే అతడిని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దు చేయించడంతో పాటు.. సీబీఐ ద్వారా ఇంటర్ పోల్‎ను ఆశ్రయించి ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. పరారీలో ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఆయన కుమారుడి తలదాచుకున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు ఇండియా వస్తేనే కేసు విచారణ కొలిక్కే వచ్చే అవకాశం ఉంది.