హైదరాబాద్, వెలుగు: నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది వ్యక్తిగత జీవితం, ఉద్యోగం మధ్య సమతుల్యం పెంపొందించాలనే లక్ష్యంతో వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం సర్క్యులర్‌ను విడుదల చేశారు. పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది అందరికీ వారి పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కల్పించడమే ప్రధాన ఉద్దేశమని అందులో పేర్కొన్నారు.
ఈ సెలవులను హక్కుగా పరిగణించరాదని, అత్యవసర పరిస్థితులు మినహా సాధ్యమైనంత వరకు మంజూరు చేయాలని యూనిట్ అధికారులకు సూచించారు. సర్వీస్ రికార్డు ప్రకారం సరైన ధ్రువీకరణ ఉండాలని, సెలవు కోరుతున్న సిబ్బంది ముందస్తు లెటర్పెట్టుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవు నిరాకరించే అధికారం పై ఆఫీసర్లకు ఉంటుందన్నారు. పని ఒత్తిడి మధ్య వ్యక్తిగత జీవితానికీ ప్రాధాన్యం ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సిబ్బంది వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది.

