చిలకలగూడ యావన్ హత్య కేసు.. 10 మంది అరెస్ట్

చిలకలగూడ యావన్ హత్య కేసు.. 10 మంది అరెస్ట్

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన బీటెక్ స్టూడెంట్ యావన్ మర్డర్ కేసును పోలీసులు ఛేధించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు ప్రధాన కారణమని నిర్ధారించిన పోలీసులు.. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి సోమవారం (మే 11) మీడియాకు వెల్లడించారు. ---------ఓ యువతితో ప్రేమ వ్యవహారమే యావన్  హత్యకు ప్రధాన కారణమని తెలిపారు. 

ముందస్తు ప్లాన్ ప్రకారమే హత్య చేశారని.. ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితులు యావన్‎పై కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారని.. హత్యకు ముందు అతడి కదలికలపై ముఠా నిఘా పెట్టారని తెలిపారు. ప్రధాన నిందితుడు సాయి కిరణ్ సహా పలువురుని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకల బట్టలు, మొబైల్ ఫోన్లు సీజ్ చేశామని అలాగే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

 అసలేం జరిగిందంటే..

తమకు సంబంధించిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, చెప్పినా వినడం లేదని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజినీరింగ్​స్టూడెంట్​యవన్ ను మే 7న రాత్రి అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన యవాన్ (25) ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. సీతాఫల్​మండికి చెందిన ఓ యువతితో నాలుగేండ్లుగా ప్రేమలో ఉన్నాడు. సీతాఫల్​మండి ఇందిరానగర్​లో యవాన్​కు ఫ్రెండ్స్​ఉండడంతో వారిని కలిసేందుకు తరచూ వస్తుండేవాడు. తను ప్రేమించిన యువతిని కూడా కలుస్తూ ఉండేవాడు. ఈ ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న అమ్మాయి బంధువులు యావన్ కు పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. 

గురువారం యావన్ ఇందిరానగర్ లోని ఫ్రెండ్స్​తో కలిసి అరుగుపై కూర్చుని క్రికెట్​చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి బావ, సోదరుడు మరో ముగ్గురితో కలిసి కత్తులతో ఇందిరానగర్ వచ్చారు. క్రికెట్​చూస్తున్న యావన్​ను గొంతుతోపాటు పలుచోట్ల విచక్షణారహితంగా పొడిచారు. మొత్తం 17 చోట్ల పొడవడంతో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ ఘటన అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది.  గమనించిన స్థానికులు గాంధీ దవాఖానకు తరలించగా, మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు.