రేకుల షెడ్లలో పోలీస్ స్టేషన్లు

రేకుల షెడ్లలో పోలీస్ స్టేషన్లు
  • వనస్థలిపురంలో, అబ్దుల్లాపూర్ మెట్ లో  ఇదీ పరిస్థితి
  • సీజ్ చేసిన వెహికల్స్ కు  సెక్యూరిటీ నిల్

ఎల్ బీ నగర్,వెలుగురాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లను స్మార్ట్ గా మారుస్తామన్న ప్రభుత్వం సిటీ శివార్లలోని కొన్ని పీఎస్ లపై ఫోకస్ చేయడం లేదు.  రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం ట్రాఫిక్ పీఎస్, అబ్దుల్లాపూర్ మెట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ రేకుల షెడ్డులో కొనసాగుతున్నాయి.  2009 నుంచి ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీకి చెందిన స్థలంలో రేకుల షెడ్డులోనే వనస్థలిపురం ట్రాఫిక్ పీఎస్ ఉంది. రెంట్ నెలకు రూ.వెయ్యిని ట్రాఫిక్ పోలీసులు చెల్లిస్తున్నారు. ఈ పీఎస్ లో 2 ఇరుకైన రూమ్స్ ఉండగా.. ఇద్దరు సీఐలు, సుమారు 110 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 10 ఏండ్లుగా వనస్థలిపురంలోని ట్రాఫిక్ పీఎస్ లో ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ ట్రాన్స్ పోర్టు ఆఫీసులు, గోడౌన్ ల మధ్యే ఈ పీఎస్ ను కొనసాగిస్తున్నారని.. ఇక్కడికి వచ్చే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పక్కా స్థలంలో పోలీస్ స్టేషన్ ను  ఏర్పాటు చేయాలని పబ్లిక్ కోరుతున్నారు. వనస్థలిపురం ట్రాఫిక్ పీఎస్ లో విమెన్ టాయిలెట్స్ లేకపోవడం మహిళా సిబ్బందికి ఇబ్బందిగా మారింది.  మరోవైపు ఈ పీఎస్ పక్కనే పాడైపోయిన ఓ పెద్ద ట్యాంక్ ఉండటంతో అది ఎప్పుడు కూలుతోందని సిబ్బంది భయపడుతున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ సైతం ఓ ప్రైవేటు స్థలంలోనే ఉంది. ఈ పీఎస్ కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఎకరం 10 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఏడాదిన్నర క్రితం బిల్డింగ్​ను నిర్మించేందుకు ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన ప్రపోజల్స్ ను ఉన్నతాధికారులకు పంపించారు. కానీ హోంశాఖ, ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆ ప్రపోజల్స్ ఇంకా పెండింగ్ లో నే ఉన్నాయి.

చెకింగ్ లో పట్టుబడ్డ వెహికల్స్ కు నో ప్లేస్

సాధారణంగా డివిజన్ ను ఓ ట్రాఫిక్ పీఎస్ ఉంటుంది. కానీ వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు ఇబ్రహీంపట్నం డివిజన్ కు కూడా తమ సేవలు అందిస్తారు. సిటీ శివారు ప్రాంతం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుండటంతో వనస్థలిపురం ట్రాఫిక్ పీఎస్ పరిధిలో వెహికల్ చెకింగ్స్ ఎక్కువగానే ఉంటాయి. డ్రంకెన్ డ్రైవ్ తో పాటు రూల్స్ బ్రేక్ చేసిన, సరైన డాక్యుమెంట్స్ లేని, చలాన్లు కట్టని ఎన్నో వెహికల్స్ ను పోలీసులు సీజ్ చేస్తుంటారు. కానీ అలా సీజ్ చేసిన వెహికల్స్ ను స్టేషన్ బయట పెట్టాలంటే పార్కింగ్ సమస్య ఉంది. ఎక్కువ చలాన్లు ఉన్న వెహికల్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. కొన్నింటిని రోడ్డుపైనే పెట్టి సేఫ్టీ కోసం గొలుసుతో లాక్ చేస్తున్నారు. దీంతో పీఎస్ లో సీజ్ వెహికల్స్ ను సెక్యూరిటీ ఉండటం లేదని వాహనదారులు చెప్తున్నారు.

నిలబడేందుకు కూడా ప్లేస్ లేదు

వనస్థలిపురం ట్రాఫిక్ పీఎస్ దగ్గరికి వచ్చిన వారు కనీసం నిలబడేందుకు కూడా ప్లేస్ ఉండదు. ఇక్కడికి వచ్చే పబ్లిక్ బయటే ఉండాలి. పోలీస్ స్టేషన్ లోపలికి ఉండటం వల్ల కొత్తవారికి అది ఎక్కుడందో తెలియదు. పీఎస్ బయట పెట్టే సీజ్ చేసిన వెహికల్స్ కు సెక్యూరిటీ లేదు.

– వెంకటేశ్, హయత్ నగర్