తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్ర బయటపెట్టిన పోలీసులు

తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్ర బయటపెట్టిన పోలీసులు

కలియుగ వైకుంఠం తిరుమలలో కలకలం రేపిన మద్యం బాటిళ్ల కేసును ఛేదించారు పోలీసులు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కార్, పోలీస్, విజిలెన్స్ విభాగాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

ప్రాథమిక దర్యాప్తులో ఖాళీ బాటిళ్లకు పోలీస్ గెస్ట్ హౌస్ కి ఎలాంటి సంబంధం లేదని నిర్దారించారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా కమాండ్ కంట్రోల్ తో పాటు, వివిధ ప్రదేశాలలో సిసి కెమెరాలు పరిశీలించి, అన్నీ ఆధారాలు సేకరించి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు పోలీసులు. ఎక్సైజ్ డిపార్టుమెంటు సహకారంతో ఖాళీ సీసాల పైన వున్న ఆధారాల ద్వారా, కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించామని తెలిపారు. ఈ కేసు లో కొంత మంది సాక్షులను, వీడియో రికార్డు చేసిన వ్యక్తులను విచారించామని తెలిపారు పోలీసులు.

దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి:

తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్ళపాటి కోటి పోలీస్ డిపార్ట్మెంట్ ని టార్గెట్ చేసి ఈ కుట్రకు పాల్పడ్డట్టు గుర్తించారు పోలీసులు. తిరుపతి నుంచి ఖాళీ బాటిళ్లను తీసుకొచ్చి తిరుమల కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర వేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ కుట్రలో కోటికి నవీన్, మోహన్ కృష్ణ, గిరి, ప్రసాద్, ముకేశ్ సహకరించినట్లు తెలిపారు పోలీసులు. టీటీడీకి, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే నిందితులు ఈ కుట్రకు పాల్పడ్డట్టు తెలిపారు పోలీసులు.

నిందితులను అదుపులోకి తీసుకొని  వారి దగ్గరి నుంచి రెండు మొబైల్ ఫోన్ లను, ఒక కారును, ఒక ల్యాప్ టాప్ ను  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సదరు మొబైల్ ఫోన్ లను టెస్టింగ్ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపినట్లు తెలిపారు. ఈ కేసులో మూడో ముద్దాయి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అయిన నవీన్ పరారీలో ఉన్నాడని అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు జరుపుతున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ కుట్రకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.