
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్న విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీకి బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు అండగా నిలిచారు. మిస్రీపై, ఆయన కుటుంబసభ్యులపై నెటిజన్లు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న అధికారిపై ఇలాంటి ట్రోల్స్ చేయడం సరికాదని మండిపడ్డారు. ‘‘విక్రమ్ మిస్రీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. అలాంటి అధికారిపై ట్రోల్స్ చేయడం సరికాదు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఇండియన్ డిప్లొమాట్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటనలో పేర్కొంది. మిస్రీపై ట్రోల్స్‌ను జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా ఖండించింది. ఆయన కూతురిపై విమర్శలు చేయడంపై ఫైర్ అయింది. ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్లు కూడా మిస్రీపై ట్రోల్స్‌ను తీవ్రంగా ఖండించాయి.
ఎందుకీ ట్రోలింగ్?: శశిథరూర్
మిస్రీపై ట్రోల్స్‌ను రాజకీయ నాయకులు కూడా ఖండించారు. ‘భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో విక్రమ్ మిస్రీ అద్భుతమైన పనితీరు కనబరిచారు. భారత్ గొంతును బలంగా వినిపించారు. అలాంటి అధికారిని ఎవరు? ఎందుకు? ట్రోల్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మిస్రీపై విమర్శలు చేస్తున్నోళ్లు ఆయన కంటే భిన్నంగా, మెరుగ్గా పని చేయగలరా?’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు. మిస్రీ నిబద్ధత గల దౌత్యవేత్త అని, భారత్ కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కొనియాడారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగులు పని చేస్తారని, వాళ్లపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
మిస్రీపై ట్రోలింగ్ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమా మీనన్‌రావు డిమాండ్ చేశారు. కాగా, భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని మిస్రీ శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే అంతకంటే ముందే ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనిపై సమావేశంలో మిస్రీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆయనపై ట్రోలింగ్ మొదలైంది.