మెదక్ జిల్లాలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

మెదక్ జిల్లాలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి
  •     మెదక్ ​జిల్లాలో 1,74,356  మంది ఓటర్లు
  •     సిద్దిపేట జిల్లాలో 1,92,669 మంది ఓటర్లు
  •     క్రిటికల్​ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

మెదక్, సిద్దిపేట, వెలుగు: మెదక్ జిల్లాలో ఈ నెల 11న  జరిగే పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6 మండలాల్లో మొత్తం 160 పంచాయతీలకు, 1,402 వార్డు మెంబర్​ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడింది. కాగా ఆయా మండలాల పరిధిలో16 సర్పంచ్, 332 వార్డ్ మెంబర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పాపన్నపేట మండలం అర్కెల పంచాయతీలో రెండు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 

అవి పోను మిగితా144 సర్పంచ్, 1,068 వార్డ్ మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు మండలాల్లో  మొత్తం 1,74,356 మంది ఓటర్లు ఉన్నారు.  ఈ మేరకు వార్డుకు  ఒకటి చొప్పున1,068 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 155 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 1,421 పోలింగ్ ఆఫీసర్లు, 1,569 మంది ఆధార్ పోలింగ్ ఆఫీసర్లను నియమించారు. 

750 మందితో పటిష్ట బందోబస్తు

మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునేలా 750 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు తెలిపారు. పోలింగ్​ మొదలుకుని ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అన్ని పోలింగ్​స్టేషన్ల వద్ద బందోబస్తు కొనసాగుతుందన్నారు. ఎన్నికల సందర్భంగా డబ్బులు, మద్యం పంపిణీ చేసినా, గొడవలు సృష్టించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్థానికంగా ఉండకూదని సూచించారు. 

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్ పూర్, మర్కుక్, ములుగు, రాయపోల్, వర్గల్  మండలాల పరిధిలోని 163 పంచాయతీలు, 1,432 వార్డు స్థానాలకు  జరగనున్నాయి. మొదటి విడతలో మొత్తం 16 గ్రామ పంచాయతీలతో పాటు 224 వార్డులు ఏకగ్రీవం కాగా 594 మంది సర్పంచ్, 3107 మంది వార్డులకు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 

మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో మొత్తం 3676 మంది సిబ్బంది విధుల్లో పాల్గొటుండగా ఇందులో 1717 పీవోలు, 1957 మంది ఏపీవోలు విధులు నిర్వహించనున్నారు. వీరికి పోలింగ్ విధులపై ఇటీవలే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. మొదటి విడత ఎన్నికలు నిర్వహించే మండలాల్లో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. దౌల్తాబాద్ మండలంలో 5, రాయపోల్ మండలంలో 2 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ గా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో 7 మండలాల పరిధిలో మొత్తం 1,92,669 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

వలస ఓటర్లపై నజర్ 

సిద్దిపేట: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు.  ఓ వైపు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తూనే వలస ఓటర్లను పోలింగ్ కు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు బొంబాయి, బీవండి, షోలాపూర్ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఎక్కువగా ఉన్నారు. 

వలస ఓటర్లు ఎక్కువగా జిల్లా సరిహద్దుకు సమీపంలోని అల్వాల్, కొంపల్లి, జగద్గిరి గుట్ట, ఈసీఐఎల్, సుచిత్ర, సికింద్రాబాద్, లాల్ బజార్, ప్రగతి నగర్, తిరుమల గిరి, యాప్రాల్, జవహర్ నగర్, బాలాజీ నగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇప్పటికే వలస వెళ్లిన వారి జాబితాలను సర్పంచ్, వార్డు అభ్యర్థులు సేకరించి వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. 

హైదరాబాద్​లో ప్రచారం..

రాయికోడ్: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మామిడిపల్లి పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అసలు పోరు గ్రామంలో కాకుండా హైదరాబాద్‌‌లో జరుగుతోంది. సింగూరు ప్రాజెక్టు ముంపు ప్రభావంతో ఊరిలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పెద్ద ఎత్తున నగరాలకు వలస వెళ్లిన గ్రామస్తులే ఈసారి ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించనున్నారు. గ్రామంలోని మొత్తం జనాభా సుమారు 1,600 మంది.

 వీరిలో 1,125 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో దాదాపు 750 మంది హైదరాబాద్‌‌లో కూలీ, నిర్మాణ రంగం, చిన్న వ్యాపారాలలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 14న జరిగే రెండో విడత పంచాయతీ సర్పంచ్ పోలింగ్‌‌లో ఈ వలస ఓటర్ల పాత్ర కీలకంగా మారింది. హైదరాబాద్‌‌లో ఉన్న వలస ఓటర్లను ఆకట్టుకోవడానికే ఇరు వర్గాలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి.