కూసుమంచి, వెలుగు : ప్రతి కుటుంబ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వ భరోసా కల్పిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన తిరుమలాయపాలెం ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ కలెకట్ర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి 12 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, 137 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కులు అందజేశారు.
పాలేరు నియోజకవర్గంలోని 331 మంది అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత హైదర్సాయిపేట నుంచి పడమటి తండా వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..
ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ క్రాస్ రోడ్డు ఆటోనగర్ నుంచి మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌కమిటీ వరకు రూ.4.50 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 32 వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.58.95 కోట్లు కేటాయించిందన్నారు.
అనంతరం 64 మందికి కల్యాణలక్ష్మి, 227 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. మంగళగూడెంలో కొత్తూరు నుంచి కాచిరాజుగూడెం వరకు చేపట్టనున్న రోడ్డు, స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
