V6 News

ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందే...ప్రధానిని టెర్రరిస్ట్ అంటారా?: పొంగులేటి సుధాకర్ రెడ్డి

ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందే...ప్రధానిని టెర్రరిస్ట్ అంటారా?: పొంగులేటి సుధాకర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీని ‘టెర్రరిస్ట్’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అనడం ఆయన అవివేకానికి నిదర్శనమని బీజేపీ జాతీయ నేత, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల బీజేపీ ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఫైర్ అయ్యారు. ఖర్గే తక్షణమే దేశ ప్రజలకు, ప్రధానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. 

ఉగ్రవాద రహిత భారత్ కోసం ప్రధాని మోదీ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో దేశం సురక్షితంగా ఉందని పొంగులేటి కొనియాడారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పది రోజులుగా అక్కడ పర్యటించానని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని ఎన్డీయే కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ద్రవిడియన్ మోడల్ పాలనలో అరాచకాలు, అక్రమాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. 

కేవలం భాష, ప్రాంతీయ సెంటిమెంట్లను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న సీఎం స్టాలిన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. స్టాలిన్ కుటుంబ సభ్యులు అనేక స్కామ్‌‌‌‌లలో మునిగిపోయారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. రైతుల రుణమాఫీ, మహిళలకు ఆర్థిక సాయం వంటి పథకాలు నేటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు.  ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాళేశ్వరం వంటి అంశాలపై కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.