- మంత్రి పొన్నం ఆరోపణ
- ఐఏఎస్‌ల కమిటీతో చర్చలు జరుగుతుండగా మధ్యలో ఫోన్ రాగానే వెళ్లిపోయారు
- జేఏసీ నేతలపై ఆగ్రహం
- కార్మికులు సమ్మె విరమించి, విధుల్లో చేరాలని సూచన
హైదరాబాద్, వెలుగు : గతంలో ఆర్టీసీ యూనియన్‌కు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్‌రావు ఒక కుట్ర ప్రకారం కార్మికులను రెచ్చగొట్టి , సమ్మెకు కారణమయ్యారని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించేందుకు ఐఏఎస్‌ల కమిటీ సిద్ధంగా ఉన్నప్పటికీ, చర్చల మధ్యలో హరీశ్‌రావు నుంచి ఫోన్ రావడంతో జేఏసీ నేతలు బయటకు వెళ్లి సమ్మె ప్రకటించారని ఫైర్ అయ్యారు.
ఆర్టీసీ సమ్మెతో హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న 32 అంశాల్లో 29 అంశాలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మిగిలిన మూడు అంశాలు విలీనం, యూనియన్ల అనుమతి, పీఆర్సీపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు.
‘మహాలక్ష్మి’ని అప్రతిష్టపాలు చేసేందుకే..
మహాలక్ష్మి పథకాన్ని అప్రతిష్టపాలు చేయాలని బీఆర్ఎస్ నేతలు కుట్ర పన్నారని మంత్రి ఆరోపించారు. జగిత్యాల సభలో ఈ పథకం గురించి కేసీఆర్ హేళనగా మాట్లాడారన్నారు. యూనియన్లకు నాయకత్వం వహిస్తున్న వారిలో చాలా మంది రిటైర్ అయినవారేనన్నారు. వీళ్లంతా కలిసి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని, వారి ఉచ్చులో పడవద్దన్నారు. ఈవీ బస్సుల వల్ల ఆర్టీసీలో ఒక్కరి ఉద్యోగం కూడా పోదని చెప్పారు.
అవి కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఆర్టీసీకి వస్తున్నాయని, 2018 నుంచే ఈవీ బస్సులు వస్తున్నాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం యూనియన్లను రద్దు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీకి రూ.300 కోట్లు ఇస్తోందని, రూ.400 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమని మంత్రి తెలిపారు.

