తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీసీ ముసుగు
హైదరాబాద్, వెలుగు: తప్పులు చేస్తూ.. వాటి నుంచి తప్పించుకోవడానికి మంత్రి గంగుల కమలాకర్ బీసీ ముసుగు కప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. బలహీన వర్గాలకు చెం దిన వ్యక్తిని పార్టీ నుంచి గెంటేసినప్పుడు అధికార పార్టీలోని బీసీ నేతల ఆత్మగౌరవం ఏమైపోయిందని ప్రశ్నించారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2023 వరకు బీసీలకు బడ్జెట్‌లో ఎంత ఇచ్చారని ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. దొరల గడీలను బద్ధలు కొట్టేందు కు మీటింగ్ పెట్టుకున్న అధికార పార్టీ బీసీ నేత లను అభినందిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ ఉంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌కు జాతీయ, రాష్ట్రాధ్యక్షుడు కేసీఆరేనని, కానీ, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి అని, ప్రచార కమిటీ చైర్మన్ బీసీ అని తెలిపారు. కాగా, మిత్రపక్షాలను చీల్చి బలహీనపర్చడమే బీజేపీ పని అని ఆరోపించారు. ఎన్డీయే అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదని, నేషనల్ డెవలప్‌మెంట్ ఫర్ అదానీ అని ఎద్దేవా చేశారు. లోక్‌సభలో అంతగా ప్రాధాన్యం లేని పార్టీలే బీజేపీ మిత్రపక్షాలని పేర్కొన్నారు. మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికే ప్రధాని మోదీ ఎన్డీయే మీటింగ్ పెట్టారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఉనికి కోల్పోయిందని, గోడమీద పిల్లిలాగా ఆ పార్టీ ఎవరికి సపోర్ట్ చేయట్లేదన్నారు.

