- హైదరాబాద్ జిల్లా పరిధిలో 113 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
హైదరాబాద్ సిటీ, వెలుగు: సమాజ నిర్మాణంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులదే అత్యంత కీలక పాత్ర అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అబిడ్స్‌లోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో.. పలు స్కూళ్లకు చెందిన 113 మంది ఉపాధ్యాయులను 'ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు', ప్రశంసాపత్రాలతో మంత్రి సత్కరించారు.
అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,000 కోట్లు కేటాయించామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. టీచర్లు విద్యావ్యవస్థకు వెన్నెముక అని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని, టెన్త్‌ఫలితాల్లో జిల్లా ముందంజలో ఉందని పేర్కొన్నారు.
