చేప ప్రసాదం పంపిణీకి లక్షా 25 వేల చేప పిల్లలు..35 కౌంటర్లు

చేప ప్రసాదం పంపిణీకి లక్షా 25 వేల చేప పిల్లలు..35  కౌంటర్లు

బత్తిని కుటుంబం అందించే చేప ప్రసాదం పంపిణీకి రంగం సిద్ధమైంది. జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత ఏడాది కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా లక్షా 25 వేల చేప పిల్లలను సిద్ధం చేసినట్లు వెల్లడించిన మంత్రి, అవసరమైతే అదనపు నిల్వలను కూడా ఉంచాలని ఫిషరీస్ శాఖను ఆదేశించారు. తోపులాటలు జరగకుండా 35 కౌంటర్లు, పటిష్టమైన బారికేడ్లు ,సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.  పోలీస్, ట్రాఫిక్, జిహెచ్‌ఎంసీ, మెడికల్ ,విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ , మెట్రో రైళ్ల ద్వారా ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయని చెప్పారు. 

►ALSO READ | రాష్ట్ర ప్రజలు పెట్రోల్,డీజిల్ సేవ్ చేయాలి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

ప్రభుత్వ ఏర్పాట్లతో పాటు అగర్వాల్ సమాజ్, జైస్వాల్ సమాజ్, బత్తిని ట్రస్ట్‌లు యధావిధిగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తాయని చెప్పారు పొన్నం. . తాగునీరు, శానిటేషన్ , రాత్రి వేళల్లో మెరుగైన లైటింగ్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు పొన్నం.