నన్స్ పై లైంగిక వేధింపులు నిజమే: పోప్ ఫ్రాన్సిస్

నన్స్ పై లైంగిక వేధింపులు నిజమే: పోప్ ఫ్రాన్సిస్

Pope admits clerical abuse of nuns including sexual slaveryవాటికన్ సిటీ: క్యాథలిక్ చర్చిలు, వాటి అనుబంధ సంస్థల్లో నన్ లపై లైంగిక వేధింపులు నిజమేనని పోప్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. కొం దరు ప్రీస్ట్ లు, బిషప్ లు దురాగతాలకు ఒడిగట్టారని, వాళ్లపై చర్యలు తీసుకున్నామన్నారు. మూడురోజుల యూఏఈ పర్యటనను ముగించుకుని బుధవారం వాటికన్ సిటీకి తిరుగుపయనమైన ఆయన.. విమానంలో మీడియాతో మాట్లాడారు. ‘నన్ లపై లైంగిక వేధింపులు అన్ని చోట్లా ఉన్నాయి. కొన్ని రీజియన్లు, కొత్తగా ఏర్పడుతున్న చర్చిల్లోనైతే ఈ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవన్నీ బయటపడ్డ పాపాలు. మనకు తెలియకుండా ఇంకా చాలా జరుగుతుండొచ్చు. ప్రతికూలతల దృష్ట్యా ఈ దురాగతాన్ని అంత తొందరగా అంతం చేయలేమని నా భావన. మత పెద్దలుగా మా దృష్టికి వచ్చిన అన్ని కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తున్నాం. పాపాత్ముల పనిపడుతున్నాం. అయితే నన్ లకు  నూరుశాతం అభయమివ్వాలంటే ఈ మాత్రం చర్యలు సరిపోవు. ఇంకా చాలా చేయాల్సి ఉంది’ అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.

‘కేరళ’ ఘటనపై కదలికే ఈ ప్రకటన
చర్చిల్లో మత గురువుల లైంగిక అకృత్యాలపై పోప్ స్థాయి వ్యక్తి బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా చాలా మంది నన్ లు బాధల్ని వెల్లడిం చారు. కేరళలోని క్యాథలిక్ చర్చిలో ఓ నన్ పై బిషప్ ఫ్రాంకో ములక్కల్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటనను
హైలైట్‌‌ చేస్తూ ‘విమెన్ చర్చి వరల్డ్ ’అనే అంతర్జాతీయ మ్యాగజైన్ ఇటీవల ప్రచురించిన కథనం దుమారం రేపింది. ఆ నేపథ్యంలోనే పోప్‌‌ నోరువిప్పాల్సివచ్చింది. చర్చిల్లో లైంగిక అకృత్యాల వల్ల నన్లు క్షోభ అనుభవించడమేకాదు, తండ్రి ఎవరో తెలియకుండా పుడుతున్న పిల్లల సంఖ్య పెరిగి పోతున్నదని ‘విమెన్ చర్చి వరల్డ్ ’ ఎడిటర్ లుసెట్టా స్కారఫ్పియా అన్నారు.