దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి ఏటా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఏపీ సర్కార్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు మూడో బిడ్డకు రూ.30వేలు, నాల్గవ బిడ్డను కన్నవారికి రూ.40వేలు వెంటనే ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ క్యాష్ ఇన్సెన్టివ్ స్కీమ్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలను పెంచటం అసాధ్యం అని కొందరు అంటుంటే. డాక్టర్లు కూడా చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టడానికి, భవిష్యత్తులో వృద్ధుల జనాభా పెరగకుండా చూసేందుకు ఒక వినూత్న పథకాన్ని ప్రకటించారు. 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మూడో బిడ్డ పుడితే 30 వేల రూపాయలు, నాలుగో బిడ్డ పుడితే 40 వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటించారు. జనాభా నియంత్రణపై గతంలో ఉన్న తన వైఖరిని మార్చుకుంటూ.. రాష్ట్ర ఆర్థిక, జనాభా సమతుల్యతను కాపాడటానికి ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నది సీఎం ఆలోచన. అయితే ఈ క్యాష్ ఇన్సెన్టివ్ ప్రకటనపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఒకేసారి ఇచ్చే డబ్బుతో పిల్లల భవిష్యత్తు సాధ్యమేనా? అంటూ స్కీమ్ పై ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని రాజకీయం చేయవద్దని, కేవలం ఒక పీడియాట్రీషియన్‌గా.. ఒక తల్లిగా పిల్లల సంక్షేమం కోసమే తాను మాట్లాడుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.30వేలు లేదా రూ.40వేలు వంటి ఒకేసారి ఇచ్చే నగదు ప్రోత్సాహకాలు కేవలం కొన్ని రోజుల ఖర్చులకే సరిపోతాయని, కానీ పిల్లలను పెంచడం అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియని ఆమె గుర్తుచేశారు.
పిల్లలకు కావాల్సింది సరైన సంరక్షణ..
ఎక్కువ మంది పిల్లలను కనే ముందు తల్లిదండ్రులు వారి భవిష్యత్ అవసరాలను ఆలోచించుకోవాలని డాక్టర్ శివరంజని సూచించారు. ఇప్పుడు ఉన్న బయటి పరిస్థితుల్లో ముగ్గురు, నలుగురు పిల్లలను కంటే వారికి సరైన పౌష్టికాహారం, మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్యను అందించడం తల్లిదండ్రులకు సాధ్యమేనా అని ఆమె ప్రశ్నించారు. కేవలం ఆర్థికపరమైన సపోర్ట్ మాత్రమే కాకుండా.. ప్రతి బిడ్డకు సమానంగా సమయం కేటాయించడం, ప్రేమను పంచడం, తగినంత నివాస స్థలాన్ని కల్పించడం వంటివి ముఖ్యం అన్నారు. లాంగ్ టర్మ్ ప్లానింగ్ లేకుండా ఫ్యామిలీని పెంచితే అది అటు తల్లిదండ్రులకు, ఇటు పిల్లలకు కూడా తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుందని, ఇలాంటి స్కీమ్‌లు ఇతర రాష్ట్రాలకు కూడా పాకొద్దని ఆమె కోరారు.
అంతా డబ్బుతో ముడిపడిన ఈ రోజుల్లో పిల్లలు పుట్టడానికే లక్షలు ఖర్చవుతున్నాయి. వారిని స్కూలులో చేర్పించటానికి పెద్ద చేయటానికి లక్షల్లో వెచ్చించాల్సి వస్తోంది పేరెంట్స్. చిన్న అనారోగ్యం వస్తేలే వేల నుంచి లక్షలు ఖర్చవుతున్న కాలంలో సరైన ఆర్థిక ప్రణాళికలు లేకుండా ఎక్కువ మంది పిల్లలను కనటం సరైనది కాదని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
