సీనియర్ రైటర్ బాల మురుగన్ కన్నుమూత

సీనియర్ రైటర్ బాల మురుగన్ కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలకు బాలమురుగన్ కథ అందించారు. గత కొన్నాళ్లుగా వయోభారం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు భూపతిరాజా వెల్లడించారు. 

తెలుగులో బాలమురుగన్.. ధర్మదాత, ఆలుమగలు, సోగ్గాడు, సావాసగాళ్లు, జీవన తరంగాలు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందించారు. అలాగే ఆయన గీతా ఆర్ట్స్ మొదటి సినిమా బంట్రోతు భార్య సినిమాకు కూడా ఆయనే కథ‌ను అందించారు. శోభన్ బాబు హీరోగా తెరకెక్కిన సోగ్గాడు సినిమా ఎంత బ్లాక్ బస్టర్‭గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమిళంలో స్టార్ హీరోగా ఒకప్పుడు చక్రం తిప్పిన శివాజీ గణేషన్‭కి దాదాపు 30 నుంచి 40 సినిమాలకు బాలమురుగన్ కథలు అందించారు.

బాలమురుగన్ మృతి చెందిన  విషయం తెలుసుకున్న తెలుగు,  తమిళ సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాల మురుగ‌న్ త‌న‌యుడు భూప‌తి రాజా కూడా తండ్రిలాగానే సినీ రంగంలో రైట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు క‌థ‌ను అందించారు.