తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డ్ స్థాయికి చేరుకుంది. మార్చి 3న మంగళవారం ఉదయం 11:01 గంటలకు 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ వినియోగం నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు . రాష్ట్ర విద్యుత్ సంస్థ చరిత్రలోనే గరిష్ట డిమాండ్ ను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తిచేసి నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్తు రంగంలోని ఉన్నతాధికారులు, యావత్ సిబ్బందికి డిప్యూటీ సీఎం భట్టి అభినందనలు తెలియజేశారు.
ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనం అని అన్నారు భట్టి. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లను సమానంగా లేదా అధిగమించే స్థాయికి చేరుకున్నాం అని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తోంది అన్నారు.
జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిభ
18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌తో తెలంగాణ.. సుమారు 19,900 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను నమోదు చేసిన మధ్య ప్రదేశ్, అలాగే 19,600–20,600 మెగావాట్ల మధ్య గరిష్ట డిమాండ్ నమోదైన రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలకు సమానంగా నిలిచిందన్నారు. భూభాగం, జనాభా పరంగా చిన్నదైనా తెలంగాణ తన సామర్థ్యాన్ని చాటిందన్నారు. అదేవిధంగా పంజాబ్, హర్యానా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ట డిమాండ్‌ను తెలంగాణ నమోదు చేసిందనీ ఆ ప్రకటనలో తెలిపారు. భౌగోళికంగా చిన్నదైనా, అధిక విద్యుత్ వినియోగ సాంద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. ఐటీ, ఔషధ తయారీ, తయారీ రంగం, సాగునీటి విస్తరణ వంటి రంగాల్లో వేగవంతమైన వృద్ధి దీనికి ప్రధాన కారణం అని డిప్యూటీ సీఎం వివరించారు.
►ALSO READ | ధర్మవాణికి తొలిరోజే 54 అర్జీలు..19 అప్లికేషన్లు స్పాట్‌లోనే పరిష్కారం
డిమాండ్ పెరుగుదల
- 2023-24: గరిష్ట డిమాండ్15,623 మెగావాట్లు (08.03.2024)
- 2024–25 గరిష్ట డిమాండ్: 17,162 మెగావాట్లు(20.03.2025)
- 2025–26 (మునుపటి గరిష్టం): 17,162 మెగావాట్లు
- 2026 (ప్రస్తుతం): 18,139 మెగావాట్లు(03.03.2026) – కొత్త గరిష్ట దశలోకి ప్రవేశించామని వివరించారు.
