ముషీరాబాద్, వెలుగు: ప్రజా నాట్య మండలితోనే బుర్ర కథలకు ప్రాచుర్యం వచ్చిందని రిటైర్డ్ జస్టిస్ నాగమారుతి శర్మ అన్నారు. మహా కళాకారుడు నాజర్ ప్రజానాట్య మండలి సభ్యుడిగా బుర్రకథ ద్వారా చైతన్యవంత కథలు చెప్పారని గుర్తు చేశారు. శుక్రవారం త్యాగరాయ గానసభ లో కళా సుబ్బారావు జయంతి సందర్భంగా జరుగుతున్న బుర్ర కథ సప్తాహంలో భాగంగా చౌకు లింగం బృందం భక్త మార్కండేయ బుర్ర కథ రసవత్తరంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన జస్టిస్ నాగ మారుతి శర్మ కళాకారులను సత్కరించి మాట్లాడారు. ఏ కళ అయినా ప్రజల ఆదరణ ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి జ్ఞాపకార్థం రూ. 25 వేలను గాన సభకు విరాళంగా ఇచ్చారు. సాహితీ కిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు, గాన సభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, గాన సభ సంయుక్త కార్యదర్శి చక్రపాణి పాల్గొన్నారు.
