కోఠిలో ప్రజా పాదయాత్రను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

కోఠిలో ప్రజా పాదయాత్రను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

కోఠిలోని ఇసామియ బజార్ లో గోషా మహల్ కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పాదయాత్రను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. కార్పొరేటర్ గా సురేఖ గెలిచి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఈ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామితో పాటు గోల్కొండ జిల్లా అధ్యక్షులు పాండు యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ పాదయాత్ర మూడు రోజులు పాటు సాగనుంది.

విద్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా నిధులు ఇస్తలె

మంచి ఆలోచనతో పాదయాత్ర  కార్యక్రమం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజల సమస్యలు తెలుకోవడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు. కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోవాలన్న వివేక్ వెంకటస్వామి... గుజరాత్ లో 27 సంవత్సరాల నుండి బీజేపీ ఉందని తెలిపారు. బీజేపీ అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తుందని గుజరాత్ ప్రజలు గెలిపించారని చెప్పారు. హిమాచల్ లో ఓడిపోయినా రాష్టం అభివృద్ధి కావాలని, నిధులతో పాటు ఆదుకుంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారన్నారు. తెలంగాణకు పెద్ద ఎత్తున కేంద్ర నిధులు వచ్చాయని, మనం వాటిని సరిగ్గా వాడుకొని, పథకాలను ఉపయోగించుకుంటే ప్రజలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ కు రూ.5 లక్షలు సరిపోవడం లేవని, దాన్ని రూ.10 లక్షలు చేయాలని కోరానన్నారు. 

ఆయుష్మాన్ భారత్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల తో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు కలిపి రూ.10 లక్షలు ఇస్తామని గుజరాత్ ఎలక్షన్ లో భాగంగా బీజేపీ మానిఫెస్టోలో చెప్పిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మన రాష్టంలోనూ ఇదే ఆలోచనతో ముందుకు వెళ్తామన్న వివేక్.. విద్య, వైద్యంలో ప్రజలు ప్రభుత్వం వైపు చూస్తున్నారని చెప్పారు. విద్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు.

ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే...

ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడానికే ఈ ప్రజా పాదయాత్ర చేపట్టామని  కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్ అన్నారు. సమస్యలను తెలుసుకొని పర్మనెంట్ సొల్యూషన్ చూసే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 24 న జీహెచ్ఎంసీ మీటింగ్ ఉందన్న ఆమె... ప్రజల సమస్యల మీద తన గళం విప్పుతున్నానన్నారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రజా పాదయాత్రను విజయవంతం చేయాలని సురేఖ కోరారు.