- 99 రోజుల కార్యాచరణ జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్
- అభివృద్ధి పనులపై దిశానిర్దేశం
నెట్వర్క్, వెలుగు: ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణపై శుక్రవారం కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమ పురోగతిపై చర్చించారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
జిల్లా కేంద్రంలో త్వరలోనే క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో తొలుత సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పనులపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి.గీతే, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యం
పారదర్శక పాలన అందించటమే కాంగ్రెస్ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం వేదికగా నిలుస్తోందన్నారు. వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. లాభం వచ్చే పంటలు పండించేలా రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్గిరి, జుక్కల్ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, జిల్లా లైబ్రరీ చైర్మన్మద్ది చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్చైర్పర్సన్ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ధన్ఫాల్సూర్యనారాయణ, డాక్టర్ భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'ప్రజా ప్రగతి ప్రణాళిక'తోనే సమగ్ర అభివృద్ధి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా ప్రగతి ప్రణాళిక' ద్వారానే గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం మండల, గ్రామ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజల నిజమైన అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా నిధుల కేటాయింపులు చేయడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమన్నారు. నిధుల వినియోగంలో, పనుల గుర్తింపులో పారదర్శకత పాటించాలని సూచించారు. అనంతరం మెగా జాబ్ మేళలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు, టెన్త్‌తో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. మంచిర్యాల కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్కుమార్దీపక్అధికారులతో చర్చించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
సర్పంచుల వాకౌట్, నిరసన
ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో సర్పంచ్‌లు వాకౌట్‌చేశారు. మొదట జిల్లా అధికారులు మాట్లాడిన అనంతరం సర్పంచులు గ్రామాల్లోని సమస్యల గురించి అధికారులకు విజ్ఞప్తి చేసేందుకు సమయం ఇవ్వలేదు. తమను అవమానించే ధోరణితో వ్యవహారించి మైక్ కట్ చేశారని, తమ నోరు మూయించేలా వ్యవహరించారని సర్పంచ్‌లు మండిపడుతూ సమావేశం నుంచి వాకౌట్ చేసి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం లేదని, ఐదు నెలలు గడుస్తున్నా సర్పంచ్ లకు గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
