న్యూఢిల్లీ, వెలుగు: తెలం గాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతితో పాటు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రగతి పథం ప్రశంసనీయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ‘తెలంగాణ ప్రజల కు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు! తెలంగాణ రాష్ట్రం సంపన్నమైన సాంస్కృతిక వారసత్వంతో, కష్టపడి పనిచేసే ప్రజలతో విలసి ల్లుతోంది. గత కొన్నేండ్లుగా ఆవిష్కరణలు, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. తెలంగాణ ప్రజలు నిరంతర ప్రగతిని, సంక్షేమాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రాష్ట్రపతి ముర్ము కాంక్షించారు.
తలెత్తుకునేలా పాలన: రాహుల్
అమరుల ఆకాంక్షలకు తగ్గట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన ప్రతి తెలంగాణ పౌరుడు ఆత్మగౌరవంతో తలెత్తుతుకుని ముందుకుసాగేలా, అమరుల వారసత్వాన్ని నిలబెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వ పని చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ అనేది లక్షలాది మంది ప్రజల పోరాటం, త్యాగాల ఫలితం. తమ కలల తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ప్రతి ఒక్కరినీ స్మరించుకుందాం’ అని ఎక్స్ లో పేర్కొన్నారు.
ఇందిరమ్మ స్ఫూర్తితోనే ముందుకు: ఖర్గే
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమగ్రవృద్ధి, అందరికీ సమాన అవకాశాలతో కూడిన నిజమైన 'ప్రజల తెలంగాణ' సాధనే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. విప్లవాత్మక సంక్షేమ పథకాలు, ప్రజాస్వామ్య పాల న ద్వారా సమాజంలోని ప్రతి వర్గాన్ని సాధికారత వైపు నడిపిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందన్నారు. మహిళలు, యువత సాధికారత, ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణానికి 'ఇందిరమ్మ రాజ్యం' స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.
