ఏఐసీసీ సీఈఏ చీఫ్​కు నలుగురు ఎంపీల లేఖ

ఏఐసీసీ సీఈఏ చీఫ్​కు నలుగురు ఎంపీల లేఖ

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ నలుగురు కాంగ్రెస్​ ఎంపీలు ఏఐసీసీ సెంట్రల్​ ఎలెక్షన్​ అథారిటీ(సీఈఏ) చీఫ్​ మధుసూదన్​కు లేఖ రాశారు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ, పారదర్శకతపై తమకు ఆందోళనగా ఉందని, అందువల్ల ఎన్నికల బాధ్యతలను ఎలెక్టర్లకు, అభ్యర్థులకు అప్పజెప్పాలని  డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ లోక్​సభ ఎంపీలు శశిథరూర్, కార్తీ చిదంబరం, ప్రద్యుత్​ బర్దోలాయ్, అబ్దుల్​ ఖలేకీ ఈ నెల 6న సీఈఏ చీఫ్​ మధుసూదన్​కు ఆ లేఖ రాశారు.

తమ డిమాండ్​కు కొంతమంది తప్పుడు భాష్యం చెబుతున్నారని అన్నారు. ‘‘పార్టీ అంతర్గత వివరాలు రిలీజ్​ చేయాలని మేము అడగట్లేదు. ఎలక్టోరల్​ కాలేజీని నిర్ణయించే పీసీసీ ప్రతినిధుల జాబితాను.. నామినేషన్​ ప్రక్రియకు ముందే విడుదల చేయాలంటున్నాం. అభ్యర్థిని ఎవరు నామినేట్​ చేస్తారు, ఎవరు ఓటు వేయవచ్చన్న వివరాలు కూడా ఆ లిస్టులో ఉండాలి” అని ఆ నలుగురు ఎంపీలు డిమాండ్​ చేశారు. లేదంటే, ఆ సమాచారాన్ని ఎలెక్టర్లు, అభ్యర్థులతో సేఫ్​గా షేర్​ చేసుకోవడానికి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వారు సూచించారు.