స్వార్థ ప్రయోజనాల కోసమే ..లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాసం :  ప్రధాని మోదీ

స్వార్థ ప్రయోజనాల కోసమే ..లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాసం :  ప్రధాని మోదీ
  • ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నరు
  • ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్
  • తీర్మానం ఓడిపోవడంపై హర్షం.. స్పీకర్‌‌‌‌కు లేఖ

న్యూఢిల్లీ : కాంగ్రెస్  నేతృత్వంలోని ప్రతిపక్షాలు వారి స్వార్థ ప్రయోజనాల కోసమే లోక్ సభ స్పీకర్  ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారసత్వ మనస్తత్వంలో కూరుకుపోయిన కొంతమంది ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్  ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్  గాంధీని ఉద్దేశిస్తూ మోదీ మండిపడ్డారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఓడిపోయినందుకు హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు స్పీకర్  బిర్లాకు మోదీ ఆదివారం లేఖ రాశారు. ‘‘మీపై (బిర్లా) పై తెచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినందుకు నాకు ఆనందంగా ఉంది. ప్రతిపక్షాల తీర్మానాన్ని ఓడించినందుకు సభ్యులను అభినందిస్తున్నా. తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో మీరు (బిర్లా) చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా విన్నాను. మీరు ఎంతో సహనంగా ఉండి తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఇందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను” అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు సహజమేనని, వాస్తవానికి అవి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. అభిప్రాయభేదానికి, అవమానానికి చాలా తేడా ఉందన్నారు. ‘‘స్పీకర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం స్వార్థపూరితమైనదని దేశంలోని ప్రతిఒక్క పౌరుడికీ తెలుసు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, అహంకారంతోనే ఆ తీర్మానాన్ని పెట్టారని ప్రజలు అర్థం చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విధానాన్ని చూసి వారు కూడా దిగ్ర్భాంతి చెందారు. కానీ, ప్రజస్వామ్య విలువలపై వారికి నమ్మకం ఉంది” అని మోదీ చెప్పారు. కాగా.. తనకు మోదీ లేఖ రాయడంపై స్పీకర్  ఓం బిర్లా ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు.