- ఆ కలుషిత నీటి వార్తలు అబద్ధం
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ హాస్టల్లో కలుషిత నీటి వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలను ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర ఖండించారు. గురువారం హాస్టల్‌ను ఆమె సందర్శించి మాట్లాడారు. విద్యార్థులందరికీ నిత్యం ఆర్వో సిస్టమ్ ద్వారా శుద్ధి చేసిన నీటినే అందిస్తున్నామని, నీటి ట్యాంకులను ప్రతివారం క్లోరినేషన్ చేస్తూ శుభ్రపరుస్తున్నామని తెలిపారు. నీరు కలుషితం కాలేదని, విద్యార్థులెవరూ అనారోగ్యానికి గురికాకుండా ప్రస్తుతం పరీక్షలు కూడా రాస్తున్నారని స్పష్టం చేశారు.
ముందు జాగ్రత్తగా నీటి నమూనాలను సేకరించి ఐపీఎం ల్యాబ్‌కు కూడా పంపించామని, బయటి ఆహారం విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులు నిరంతరం వసతులను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అబద్ధపు వదంతులు వ్యాప్తి చేసే వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి శేఖర్ రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

