
రెసిడెన్షియల్కు 2 లక్షల నుంచి 4 లక్షలు
నానా రకాల పేర్లతో అడ్డగోలు దోపిడీ
లక్షలు పోస్తేగానీ చదువుకోలేని పరిస్థితి
పేదలకు దూరమవుతున్న ఇంటర్ ఎడ్యుకేషన్
ఫీజులపై నియంత్రణ ఏది అంటున్న పేరెంట్స్
హైదరాబాద్, వెలుగు:రెసిడెన్షియల్ క్యాంపస్‍ల్లో ఒక్కో స్టూడెంట్‌కు 2 లక్షల నుంచి 4 లక్షలు.. ఏసీ హాస్టల్ పేరిట మరో 50 వేలు.. డే స్కాలర్‌కు లక్ష నుంచి లక్షన్నర.. సెమీ రెసిడెన్షియల్ అయితే 2 లక్షలు.. ఏందీ లకారాలనుకుంటున్నరా? ఇంటర్ చదువుకు కార్పొరేట్ కాలేజీలు గుంజుతున్న ఫీజులివీ! తాము చెప్పిందే చదువు.. పెట్టిందే రేటు అన్నట్టుగా కార్పొరేట్ కాలేజీల దందా సాగుతోంది. మెడికల్, ఇంజనీరింగ్, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ పిలానీ, జిప్‌మర్ ఇలా ఎందులోనైనా ర్యాంకులు తమవేనంటూ ఏటా ఇబ్బడిముబ్బడిగా ఫీజులు పెంచేస్తున్నాయి. లక్షలు పోసి ఫీజులు కట్టని పేదలంతా మెల్లగా ఇంటర్ విద్యకు దూరమవుతున్నరు
ఏటా వేలల్లోనే పెంపు
కార్పొరేట్ కాలేజీలు ఏటేటా అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నాయి. సంవత్సరానికి రూ.30 వేల నుంచి రూ.60 వేల దాకా పెంచుతున్నాయి. ఈ కాలేజీల్లో కేవలం ఇంటర్మీడియెట్ కోర్సులు చేసేందుకు వీలుండదు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీలతోపాటు నీట్, జేఈఈ, ఎంసెట్ తదితర కాంబినేషన్లను చచ్చినట్టు తీసుకోవాల్సిందే. అప్పుడే సీటు దొరుకుతుంది. ఐకాన్, నియాన్, మెడికాన్, లియో లాంగ్, కో–స్పార్క్, స్పార్క్, ఐసీ, జెడ్–ఎఫ్‍టీబీ, ఎన్‍జెడ్, ఎల్‍టీసీ.. ఇలా రకరకాల ప్రోగ్రామ్‍లతో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎంసెట్,
ఏఐఈఈఈ–మెయిన్స్, ఐఐటీ–అడ్వాన్స్‌డ్, సీఏ–సీపీటీ, బిట్‍శాట్, ఏఎఫ్‍ఎంసీ, బీహెచ్‍యూ, జిప్‍మెర్, నిట్స్ వంటి ఎంట్రన్స్ టెస్ట్‌లకు స్పెషల్ ట్రెయినింగులు ఇస్తున్నాయి. స్టూడెంట్స్ ఎంచుకున్న కోర్సు, క్యాంపస్‌లను బట్టి ఈ ఫీజులు
మారిపోతుంటాయి.
కార్పొరేట్ చేతిలోనే మెజారిటీ కాలేజీలు
రాష్ట్రవ్యాప్తంగా1,685 వరకు ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉంటే.. అందులో 200లకుపైగా కాలేజీలు 18 కార్పొరేట్ మేనేజ్‌మెంట్ల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఈ కాలేజీల్లోనే సుమారు 3.5 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. రెసిడెన్షియల్, సెమి రెసిడెన్షియల్, డే స్కాలర్, స్కాలర్ పేరిట స్టూడెంట్లను చేర్చుకుంటారు. ఇందులో రెసిడెన్షియల్ క్యాంపస్‍ల్లో ఏటా ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. డే స్కాలర్‌కు రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షలు, సెమి రెసిడెన్షియల్‍కు రూ.2 లక్షల దాకా కట్టించుకుంటున్నారు. నీట్, జిప్‍మర్, జేఈఈ మెయిన్ తదితర కాంబినేషన్లు తీసుకున్న వారి నుంచి డ్రెస్, బుక్స్, పరీక్ష ఫీజు, ఆన్‌లైన్ ఎగ్జామ్, డిజిటల్ క్లాసులు, మెయింటెనెన్స్‌ల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు.
ఫీజులు ఘనం.. వసతులు అధ్వానం
లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా స్టూడెంట్లకు మంచి వసతులు కల్పించడంలో కార్పొరేట్ కాలేజీలు విఫలమవుతున్నాయి. హాస్టళ్లలో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. నాసిరకం భోజనం పెడుతూ.. ఒక్కో రూంలో 10 నుంచి 15 మందిని కుక్కుతున్నారు. అకడమిక్ ఇయర్ ప్రారంభంలో గోడలకు రంగులు, నీట్‍గా ఉండే బెడ్స్, టాయిలెట్స్, నాణ్యమైన మెనూలను పేరెంట్స్ కు చూపుతున్నాయి. తీరా చేరాక వాటి అసలు రంగు తెలుసుకొని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. అరకొర లెక్చరర్లు, ఇద్దరు ముగ్గురు కేర్ టేకర్లతో తతంగం నడిపించేస్తున్నాయి. అనేక మేనేజ్‍మెంట్లు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే రెసిడెన్షియల్ కాలేజీలను హాస్టళ్లుగా నిర్వహిస్తున్నాయి. తనిఖీ చేయాల్సిన అధికారులు అటూ వైపు కూడా వెళ్లడం లేదు.
జిల్లాల్లోనూ లక్షలే..
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఓ కార్పొరేట్ కాలేజీ నుంచి ఏడాదికి రూ.1.80 లక్షల ఫీజు వసూలు చేస్తోంది.
కరీంనగర్ జిల్లాలో ఓ కాలేజీ రెసిడెన్షియల్‌కు ఏసీ అయితే రూ.1.20 లక్షలు, నాన్ ఏసీ అయితే రూ.80 వేలు వసూలు చేస్తోంది. డే స్కాలర్‌కు ఏసీ అయితే రూ.60 వేలు, నాన్ ఏసీకి రూ.40 వేలు చార్జి చేస్తోంది.
వరంగల్‌లోనూ రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు.
ఖమ్మంలోనూ ఇంటర్ ఫీజులు లక్ష దాటాయి. ఏసీ రూమ్ లు, కంప్యూటీర్ ఫెసిలిటీ, ఐఐటీ కోచింగ్, నీట్ కోచింగ్ , ఎంసెట్ కోచింగ్ అంటూ రూ.80 వేల నుంచి రూ.1.40 లక్షల దాకా ఫీజులను ఫిక్స్ చేశాయి.