ఏపీలోని అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( ఏప్రిల్ 19 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... అనకాపల్లిలోని నక్కపల్లి జాతీయరహదారి దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
చెన్నై నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

