చీపురుపట్టి గదిని శుభ్రం చేసుకున్న ప్రియాంక

చీపురుపట్టి గదిని శుభ్రం చేసుకున్న ప్రియాంక

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో నిన్న(ఆదివారం) రైతులు చేపట్టిన ఉద్యమం మరోసారి హింసాత్మకంగా మారింది. లఖింపూర్ ఖేరీ నిరసనల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  ప్రియాంకా గాంధీని సీతాపూర్‌లో ఇవాళ( సోమవారం) ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా  పోలీసులతో వాగ్వాదం జరిగటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని.. సీతాపూర్ లోని స్టేట్ పీఏసీ గెస్ట్ హైస్ లో ఉంచారు.

అపరిశుభ్రంగా ఉండటంతో  గెస్ట్ హౌస్‌లోని గదిని స్వయంగా ప్రియాంక గాంధీ చీపురుతో ఊడుస్తుండగా తీసిన వీడియోను పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన కాంగ్రెస్ శ్రేణులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకకు పరిశుభ్రంగా ఉన్న గదిని కూడా ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు. స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా? అని ఒక కాంగ్రెస్ నేత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శుభ్రంగా లేని గదిని ఇచ్చినప్పటికీ.. ప్రియాంక ఏ మాత్రం పట్టించుకోకుండా గదిని తనకు తానే శుభ్రం చేసుకున్నారని కొనియాడారు.

ఆమె అరెస్టును నిరసిస్తూ ఆందోళనకారులు ఆ గెస్ట్ హౌజ్ ముందు ధర్నా చేపట్టారు. ప్రియాంకా గాంధీ, దీపేందర్ హూడాలపై పోలీసులు వ్యవహరించిన తీరును కాంగ్రెస్ ఖండించింది. సోమవారం సీతాపూర్‌లో తన కాన్వాయ్‌ను అడ్డుకున్న సమయంలో ప్రియాంకా గాంధీ పోలీసులపై తిరగబడ్డారు. తన అరెస్టు వారెంట్ చూపించాలంటూ ఆమె డిమాండ్ చేశారు.