ప్రధాని వద్ద​కు డీపీఆర్​ల ఇష్యూ

ప్రధాని వద్ద​కు డీపీఆర్​ల ఇష్యూ

ఏపీ,తెలంగాణకు మరోసారి లెటర్ రాయండి
అప్పటికీ ఇవ్వకుంటే కేంద్రమే జోక్యం చేసుకుంటుంది
కేఆర్ఎంబీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నిర్మిస్తోన్న ప్రాజెక్టుల డీపీఆర్​ల ఇష్యూను ప్రధాని నరేంద్రమోడీ నోటీస్​కు తీసుకెళ్తామని కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ యూపీ సింగ్ స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదులపై 2014 జూన్ 2 తర్వాత మొదలు పెట్టిన ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వాలని కోరితే రెండు రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తుండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నుంచి మరోసారి రెండు రాష్ట్రాలకు లెటర్ రాయాలని, అప్పటికీ వారి వైఖరిలో మార్పు రాకుంటే కేంద్రమే జోక్యం చేసుకుంటుందని తేల్చిచెప్పారు. ప్రధాని మోడీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. యూపీ సింగ్ గురువారం ఢిల్లీ నుంచి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జలసౌధ నుంచి బోర్డుల చైర్మన్లు పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్, బోర్డుల మెంబర్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. డీపీఆర్​లే ప్రధాన ఎజెండాగా ఈ మీటింగ్​లో చర్చ జరిగింది.

ఇవ్వకుంటే మేమే రంగంలోకి దిగుతాం

రెండు రాష్ట్రాలు నిర్దేశిత టైంలోగా డీపీఆర్​లు ఇవ్వకుంటే కేంద్రమే రంగంలోకి దిగుతుందని యూపీ సింగ్​ స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాలపై వీలైనంత త్వరగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని బోర్డుల చైర్మన్లకు ఆయన సూచించారు. కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప వివాదాలకు ఫుల్​స్టాప్ పడే అవకాశం లేదని చైర్మన్లు వివరించారు. డీపీఆర్​ల కోసం రాసే రిమైండర్​లోనే కౌన్సిల్​కు ఎజెండా ఇవ్వమని మరోసారి రెండు రాష్ట్రాలను కోరాలని సూచించారు. రాష్ట్రాలు పంపే ఎజెండా కోసం ఎదురుచూడకుండా రెండు బోర్డుల వద్ద ఉన్న జల వివాదాలన్నింటితో కూడిన ఎజెండాను తమకు పంపాలని ఆదేశించారు. ఎజెండా అందగానే రెండు రాష్ట్రాల సీఎంలకు లెటర్లు రాసి వచ్చే నెలలో ఢిల్లీలో మీటింగ్ నిర్వహిస్తామన్నారు.

సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు ఇంపార్టెంట్

శ్రీశైలం నుంచి ఎక్కువ నీటిని తరలించుకుపోవడానికి ఏపీ తలపెట్టిన సంగమేశ్వరం లిఫ్ట్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ప్రాజెక్టులు చాలా ఇంపార్టెంట్ అని యూపీ సింగ్​ చెప్పారు. ఈ అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే వివరాలతో హియరింగ్​కు సిద్ధం కావాలని సూచించారు. ఎన్జీటీ విచారణకు సంబంధించిన ప్రిపరేషన్, ఇతర సమాచారాన్ని తమకు పంపించాలని ఆదేశించారు.

డీపీఆర్​లు ఇవ్వకుంటే మీరేం చేస్తున్నారు

రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇచ్చాయా? అని బోర్డుల చైర్మన్ లను యూపీ సింగ్​ ప్రశ్నించారు. 20 రోజులు గడిచినా డీపీఆర్​లు ఇవ్వకుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. 2014 జూన్ 2 తర్వాత ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టు డీపీఆర్ ఇచ్చి తీరాలని ఆదేశించాం కదా? అని అడిగారు. రెండు రాష్ట్రాలు స్పందించకుంటే మళ్లీ లేఖల ద్వారా గుర్తు చేశారా? అని ప్రశ్నించారు. నాలుగేండ్లుగా బోర్డుల తరఫున డీపీఆర్​ల కోసం లేఖలు రాస్తూనే ఉన్నామని, అయినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ మీటింగుల్లో చర్చించిన అంశాలతో కూడిన మినిట్స్ ను రెండు రాష్ట్రాలకు సర్క్యులేట్ చేశామని, అందులో డీపీఆర్​లు ఇవ్వలేదనే అంశాన్ని ప్రస్తావించామన్నారు. డీపీఆర్​ల కోసం మరోసారి లెటర్ రాస్తామని తెలిపారు.

For More News..

కరోనా ఎఫెక్ట్: కన్నవాళ్లు చనిపోయినా శవాన్ని ఇంటికి తీసుకెళ్లలేని పిల్లలు

రాష్ట్రంలో కరోనా టెస్టులకు బ్రేక్

రాష్ట్రంలో మరో 920 కరోనా కేసులు