చెరకు రైతులపై కేసులు ఎత్తేయాలంటూ నిరసన

చెరకు రైతులపై కేసులు ఎత్తేయాలంటూ నిరసన

జగిత్యాల జిల్లా: చెరుకు రైతులపై పెట్టిన కేసులను వెంటనే కొట్టివేయాలని.. చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డిని  వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. గ్రామంలో రోడ్డుపైకి వచ్చి బైఠాయించి బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. నిన్న జగిత్యాలలో రైతు సంఘం నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి పట్ల పోలీసులు పవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. చెరకు ఫ్యాక్టరీని తెరిపించాలని కోరడం తప్పా..? ఎన్నేల్లు ఎదురు చూడాలంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ధిక కష్టాలు భరించలేకపోతున్నామని.. భార్యా పిల్లలకు తిండిపెట్టలేక చాలా మంది అప్పులపాలై దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు.

రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలేవీ బాగుపడలేవు

మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై చెప్పు విసిరారనే ఆరోపణపై నారాయణరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి.. రిమాండుకు పంపడం దారుణం అన్నారు. అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ.. నిన్న జగిత్యాలలో ఆందోళనలో పాల్గొన్న రైతు సంఘం నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి పట్ల పోలీసులు అత్యుత్సాహంతో అవమానకరంగా ప్రవర్తించడం దారుణమని రైతులు మండిపడుతున్నారు. రైతుల పట్ల పోలీసుల తీరు.. అక్రమ అరెస్టులు, కేసులను తీవ్రంగా వ్యతిరేకించారు. చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ తో ఇటీవల మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై చెప్పు విసిరారనే అభియోగాలపై కక్ష సాధింపులకు దిగుతున్నట్లు కనిపిస్తోందన్నారు. రైతులతో గొడవ పెట్టుకున్న ప్రభుత్వాలు బాగుపడవని వారు పేర్కొన్నారు. చెరుకు రైతులపై పెట్టిన కేసులను వెంటనే కొట్టివేయాలని..అరెస్టు చేసిన రైతు సంఘం నాయకులను, రైతులను విడిచిపెట్టాలని వారు డిమాండ్ చేశారు.