అగ్గి రాజేసిన అగ్నిపథ్.. రణరంగంలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

అగ్గి రాజేసిన అగ్నిపథ్.. రణరంగంలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గి రాజేసింది. గురువారం పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారగా.. శుక్రవారం ఆ ఆగ్రహ జ్వాలలు రాష్ట్రాన్ని తాకాయి. భారీ సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు తరలివచ్చిన ఆర్మీ అభ్యర్థులు ఒక్కసారిగా విధ్వంసానికి దిగారు.

హింసాత్మకంగా మారిన నిరసన
కేంద్రం వైఖరిని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు చేపట్టిన ఆందోళన నిమిషాల వ్యవధిలోనే హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు రైళ్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు బోగీలకు నిప్పు పెట్టారు. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేత పట్టుకుని స్టేషన్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. అంతటితో శాంతించని ఆందోళనకారులు మూడు ఫ్లాట్ ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు నిప్పంటించారు. రైల్వే స్టేషన్ బయట బస్సులపై రాళ్లు రువ్వారు. 

నిస్సహాయ స్థితిలో పోలీసులు
ఆందోళనకారులు రాళ్లు, కర్రలు, రాడ్లు.. ఇలా ఏది దొరికితే దానితో దాడులకు తెగబడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీరంగం సృష్టించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. భారీ సంఖ్యలో నిరసనకారులు తరలిరావడంతో పోలీసు యంత్రాంగం నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. 

ఒకరి మృతి.. పలువురికి గాయాలు..
పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబీర్ పేటకు చెందిన రాకేశ్ అనే 18ఏండ్ల యువకుడు మృతి చెందాడు. మరో 14 మంది గాయపడ్డారు. వారిని గాంధీ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరికి సర్జరీ చేసినట్లు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు చెప్పారు.

చర్చలకు ఆహ్వానించిన పోలీసులు
గంటలు గడిచినా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. రైల్వే పట్టాలపై కూర్చొని ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనకారుల్ని చర్చలకు ఆహ్వానించారు. 10 మంది నిరసనకారుల్ని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసర్ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. అయితే యువకులు మాత్రం అందుకు అంగీకరించలేదు. చర్చలకు అందరం వస్తామని లేనిపక్షంలో అధికారుల్నే తమ వద్దకు తీసుకురావాలని చెప్పారు. అయితే పోలీసులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఆందోళనకారులు పట్టాలపైనే కూర్చొని నిరసన కొనసాగిస్తున్నారు. మరోవైపు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసులు హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. 

ఆందోళన నేపథ్యంలో పలు రైళ్లు రద్దు
సికింద్రాబాద్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధికారులు పలు రైళ్లు రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 4 రైళ్లను తాత్కాలికంగా రద్దుచేయగా.. 6 ట్రైన్లను పూర్తిగా రద్దు చేసింది. మరో రెండు రైళ్లను దారి మళ్లించారు.  ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలు ఎంఎంటీఎస్ సర్వీసులపైనా ప్రభావం చూపాయి. 6 ఎంఎంటీఎస్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా నాంపల్లి రైల్వే స్టేషన్ మూసివేశారు.

ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. రైళ్ల రాకపోకల గురించి తెలుసుకునేందుకు 040-27786666 నెంబరును సంప్రదించాలని చెప్పింది. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు రైల్వే శాఖ చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి వెల్లడించారు.