సిటీ నెట్వర్క్, వెలుగు: పోక్సో కేసులో బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ సిటీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐద్వా నేతలు మల్లు లక్ష్మి, ఎస్ఎల్. పద్మ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కేసును నీరుగార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసిందని వారు ఆరోపించారు. సామాన్యుల విషయంలో వేగంగా స్పందించే పోలీసులు, కేంద్ర మంత్రి కొడుకు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే సిట్ రద్దు చేసి భగీరథ్‌ను రిమాండ్‌కు తరలించాలన్నారు. ఐఎఫ్టీయూ, పీడీఎస్‌యూ, పీవోడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.
వారం రోజులైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం రాజకీయ ఒత్తిళ్లకు నిదర్శనమని నాయకురాళ్లు సంధ్య, ఝాన్సీ, అనురాధ ఆరోపించారు. బండి సంజయ్ తన పలుకుబడితో కేసును నీరుకారుస్తున్నారని, ఆయన్ని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని కోరుతూ జీడిమెట్ల డిపో ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన తెలంగాణ శ్యామ్‌ను సూరారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీక్షకు అనుమతి లేదని పేర్కొంటూ అతడిని అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నల్లకుంటలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత మాట్లాడుతూ.. ఒక అమ్మాయికి సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం వాస్తవాలను సమాజానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు.
సీఎం ఇంటివైపు దూసుకెళ్లిన బక్క జడ్సన్
జూబ్లీహిల్స్ , వెలుగు: బాలికపై లైంగికదాడి కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్కొడుకును ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదంటూ బుధవారం మధ్యాహ్నం బక్క జడ్సన్ ..సీఎం రేవంత్‌రెడ్డి ఇంటివైపు దూసుకువెళ్లారు. బైక్‌పై ముఖ్యమంత్రి ఇంటికి చేరుకోగా, అక్కడ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బక్క జడ్సన్మాట్లాడుతూ.. బండి భగీరథ్‌ను రాష్ట్ర ప్రభుత్వమే కాపాడుతుందంటూ ఆరోపించారు. బాలికపై అత్యాచారం చేసి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న అతడిని ప్రభుత్వం ఎందుకు కాపాడుతుందో అర్థం కావడం లేదన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదన్నారు. జడ్సన్ ను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టారు.
‘పరారీ’ పోస్టర్ల కలకలం
పద్మారావునగర్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ‘పరారీలో ఉన్నాడు’ అంటూ బుధవారం సికింద్రాబాద్ పరిసరాల్లో పోస్టర్లు వెలిశాయి. పోక్సో కేసు నిందితుడైన భగీరథ్ ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్ ఆవరణలో ఈ పోస్టర్లను అంటించారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెంటనే వాటిని తొలగించారు.
