మరాఠా కోటా ఆందోళనలు ఉధృతం

మరాఠా కోటా ఆందోళనలు ఉధృతం

బీడ్(మహారాష్ట్ర): విద్యా, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ  మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతంలోని మొదలైన ఆందోళనలు మంగళవారం కొనసాగాయి. సోమవారం జరిగిన హింసాకాండ దృష్ట్యా పోలీసులు బీడ్‌‌‌‌ నగరంలో ఆంక్షలు విధించారు. ట్రాన్స్​పోర్ట్, ఇంటర్​నెట్ సేవలను నిలిపివేశారు. కర్ఫ్యూ విధించడంతోపాటు పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు మంగళవారం పుణె సిటీలో నిరసన కారులు ముంబై – -బెంగళూరు హైవేను దిగ్బంధించి నిరసనలు తెలిపారు. మరాఠా క్రాంతి మోర్చా కార్యకర్తలు షోలాపూర్​లో రైలు పట్టాలపై టైర్లు తగలబెట్టారు. 

పుణెలోని నాయకుల ఇండ్లు, ఆఫీసుల ముందు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ధరాశివ్, బీడ్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ ​అమలుచేశారు. బీడ్​ జిల్లాలో సోమవారం జరిగిన హింసాకాండకు సంబంధించి 49 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని బీడ్ ఎస్పీ నందకుమార్ ఠాకూర్ తెలిపారు. మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మహారాష్ట్రలో గత కొన్నాళ్లుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, “జస్టిస్ సందీప్ షిండే కమిటీ మొదటి నివేదికకు ఆమోదం లభించింది. మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమైంది’’ అని సీఎం ఆఫీసు నుంచి ఓ ప్రకటన వెలువడింది.