మిడ్​సైజ్​ ఎస్​యూవీల కోసం ఎగబడుతున్న జనం

మిడ్​సైజ్​ ఎస్​యూవీల కోసం ఎగబడుతున్న జనం
  • ​​​​​​ఇప్పటికీ లక్షకుపైగా బుకింగ్స్​
  • సప్లై చేయలేకపోతున్న మారుతి సుజుకీ
  • ఆలస్యమవుతున్న డెలివరీలు  

న్యూఢిల్లీ:  మారుతీ సుజుకీ మనదేశంలో తన ఎస్​యూవీ మార్కెట్‌‌‌‌ను వేగంగా బలోపేతం చేస్తోంది. ఈ కంపెనీ మిడ్​సైజ్​ ఎస్​యూవీల కోసం జనం ఎగబడుతున్నారు.  ముఖ్యంగా గ్రాండ్​ విటారా, బ్రెజ్జాలకు కస్టమర్ల నుంచి విపరీతమైన డిమాండ్​ ఉంది. తగిన టైమ్​కు డెలివరీ ఇవ్వలేక కంపెనీ తంటాలు పడుతోంది. ఉదాహరణకు ఎర్టిగా సీఎన్జీ కావాలంటే కొన్ని రాష్ట్రాల్లో తొమ్మిది నెలల వరకు ఆగాల్సి వస్తోంది. బ్రెజ్జా ఆటోమేటిక్​ కావాలంటే కనీసం 7.5 నెలలు వేచిచూడాలి. ఈ రెండు బండ్లకు తక్కువ ధర ఎక్కువ ఫీచర్లు ఉండటంతో జనం ఎగబడుతున్నారు. కంపెనీ ఇప్పటికే ముఖ్యమైన కాస్మెటిక్, ఫీచర్  మెకానికల్ అప్‌‌గ్రేడ్‌‌లతో కొత్త తరం బ్రెజ్జాను పరిచయం చేసింది.  హ్యుందాయ్ క్రెటాకు పోటీగా డెవెలప్​ చేసిన మిడ్-సైజ్ ఎస్​యూవీ గ్రాండ్ విటారా కూడా లాంచ్​ అయింది. ఈ రెండు ఎస్​యూవీల కోసం ఇప్పటి వరకు లక్ష బుకింగ్స్​వచ్చాయి. కొత్త బ్రెజ్జా కోసం కంపెనీ 75వేల బుకింగ్స్​ను తీసుకుంది.  త్వరలో అమ్మకానికి రాబోతున్న గ్రాండ్ విటారా కోసం 26 వేల మంది ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై కంపెనీ  సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ రెండు కొత్త ఎస్​యూవీ లకు అద్భుతమైన స్పందన లభిస్తోందని అన్నారు. 

హైబ్రిడ్​ వేరియంట్లకు డిమాండ్​..

మారుతి గ్రాండ్ విటారా కోసం ప్రీ-బుకింగ్స్​లో సగానికి పైగా హైబ్రిడ్ టెక్ వేరియంట్‌‌ కోసమే వచ్చాయి. దీనిని సుజుకి  గ్లోబల్- సి ప్లాట్‌‌ఫారమ్ ఆధారంగా స్మార్ట్ హైబ్రిడ్ టెక్‌‌తో తయారు చేశారు. ఇది 1.5 లీటర్​ కే15సీ డ్యూయల్​ జెట్​ పెట్రోల్,   1.5లీటరు టీఎన్​జీఏ పెట్రోల్‌‌ వెర్షన్లతో అందుబాటులో ఉంటుంది. మాన్యువల్,  ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్‌‌లలో  ఏదో ఒక దానిని ఎంచుకోవచ్చు. మాన్యువల్ గేర్‌‌బాక్స్‌‌తో మాత్రమే అందుబాటులో ఉండే ఆల్​గ్రిప్​ ఏడబ్ల్యూడీ  సిస్టమ్.. 4 డ్రైవింగ్ మోడ్‌‌లను అందిస్తుంది . వీటిలో- ఆటో, శాండ్, స్నో  లాక్ ఉంటాయి. మాన్యువల్ ఎఫ్​డబ్ల్యూడీ వేరియంట్ 21.1 కిలోమీటర్ల మైలేజ్​ అందిస్తుంది. ఆటోమేటిక్ ఎఫ్​డబ్ల్యూడీ మోడల్ 20.58 కిలోమీటర్ల మైలేజ్​ ఇస్తుంది.  మాన్యువల్ ఏడబ్ల్యూడీ వెర్షన్ 19.38 కిలోమీటర్లు వెళ్తుందని  కంపెనీ ప్రకటించింది.  మారుతి సుజుకి 2023 ఢిల్లీ ఆటో ఎక్స్‌‌పోలో తన సరికొత్త కూపే ఎస్​యూవీ ని కూడా లాంచ్​ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్​ను సుజుకి  హార్ట్‌‌టెక్ ప్లాట్‌‌ఫారమ్‌‌లో రూపొందించారు. ఇది బూస్టర్‌‌జెట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌‌తో వస్తుంది. కొత్త మారుతి వైటీబీ కూపే ఎస్​యూవీ ఎలక్ట్రిక్ పవర్‌‌ట్రెయిన్‌‌తో కూడా అందిస్తారని సమాచారం.  బ్రెజ్జా ఎక్స్​ షోరూమ్​ ధర రూ. 8–14 లక్షలు, విటారా ధర రూ. 11–18 లక్షలు.

గ్రాండ్ విటారాను లాంచ్​ చేసిన యాక్టర్​ పాయల్ రాజ్‌‌‌‌పుత్

మారుతి సుజుకీ గ్రాండ్ విటారా కొత్త మోడల్ ను హైదరాబాద్ మార్కెట్ లో విడుదల చేసింది.  హైదరాబాద్​నాగోల్ లోని కళ్యాణి మోటర్స్  నెక్సా లో  ఈ ఎస్‌యూవీని టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌‌పుత్ లాంచ్​ చేశారు. గ్రాండ్​ విటారా కోసం తమకు ఇప్పటి వరకు 200 లకు  కంటే ఎక్కువ బుకింగ్స్​ వచ్చాయని కళ్యాణి మోటార్స్ తెలిపింది.

ఏ కారుకు ఎంత వెయిటింగ్​ పీరియడ్​ ?
మోడల్    ​వెయిటింగ్​ పీరియడ్
    (వారాలు)
బ్రెజ్జా ఎల్​ఎక్స్​ఐ    34-38     బ్రెజ్జా వీఎక్స్​ఐ    8-12      బ్రెజ్జా జెడ్​ఎక్స్​ఐ, 
జెడ్​ఎక్స్​ఐ+    16-20  
బ్రెజ్జా ఆటోమేటిక్    30-32  
ఎర్టిగా పెట్రోల్    16-20 
ఎర్టిగా సీఎన్​జీ    34