రెరాలో పబ్లిక్ గ్రీవెన్స్, గైడెన్స్ సెల్.. ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్లు, అర్హతలు, రూల్స్ పై అవగాహన

రెరాలో పబ్లిక్ గ్రీవెన్స్, గైడెన్స్ సెల్..  ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్లు, అర్హతలు,  రూల్స్ పై అవగాహన

హైదరాబాద్, వెలుగు: బిల్డర్లు, డెవలపర్లు, ప్రమోటర్లు, కొనుగోలుదారులకు మెరుగైన సేవలందించేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీరెరా)లో పబ్లిక్ గ్రీవెన్స్, గైడెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ధ్రువపత్రాలు, ఉండాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఈ సెల్ వివరించనుంది. దీంతోపాటు ప్రమోటర్లకు ఉండాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించనుంది. ముఖ్యంగా కొనుగోలుదారులకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు, అనుమానాలను సైతం నివృత్తి చేయనుంది. సెల్ ఏర్పాటుకు సంబంధించి రెరా ఎక్స్ ఫ్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) ద్వారా నోటిఫికేషన్ మంగళవారం జారీ చేసింది. సెల్ ఏర్పాటుతోపాటు నిర్వహణ, ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) కోసం ఆసక్తి ఉన్నవారు బిడ్ దాఖలు చేయాలని రెరా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కోరారు.  

ఇంజినీరింగ్, లీగల్, ఐటీ సేవలు..

రెరా అంటే  పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసమేనని చాలా మంది భావిస్తున్నారు. కానీ 500 చదరపు మీటర్ల కంటే అధిక విస్తీర్ణంలో చేపట్టిన ప్రాజెక్టు, 8 యూనిట్ల కంటే ఎక్కువగా నిర్మించిన ఏ ప్రాజెక్టునైనా రెరాలో రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సెల్ చూసుకోనుంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల విషయంలో ఇంజినీరింగ్ కు సంబంధించిన నిబంధనలు, క్వాలిటీ, ప్రమాణాలు, ఇతర అంశాలను పర్యవేక్షణ బాధ్యతలను ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఇస్కీ)కు  అప్పగించాలని రెరా భావిస్తున్నట్టు తెలిసింది. న్యాయపరమైన అంశాలను పర్యవేక్షించడానికి నల్సార్ లా యూనివర్సిటీకి, ఐటీ సేవలను టీజీ ఆన్ లైన్ సంస్థలకు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ), ఇంటర్నేషనల్ అర్బీట్రేషన్ సెంటర్ సేవలను వినియోగించుకునేందుకు రెరా ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.