ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా పెంబిలో ఓ దళిత మహిళ ఇంటిని అక్రమంగా కూల్చివేసిన వారిని వెంటనే అరెస్ట్చేయాలని పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఖానాపూర్ లో దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ.. పెంబి గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న ఓ దళిత మహిళ సేవలను గుర్తించి 2014లో నాటి గ్రామపంచాయతీ పాలకవర్గం ఓ ప్రభుత్వ భవనంలో ఆమె నివాసముండేందుకు అనుమతించిందని తెలిపారు.
అయితే 2024 నుంచి వీడీసీ పేరుతో కొందరు ఆ ఇంటిని ఖాళీ చేయాలని బెదిరిస్తూ ఆ మహిళ కుటుంబాన్ని వేధిస్తున్నారన్నారు. తాజాగా ఆమె నివాసముంటున్న ఇంటిని జేసీబీలతో కూల్చివేశారని తెలిపారు. కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పెంబిలో వీడీసీ పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై జిల్లా అధికారులు విచారణ జరపాలని కోరారు. బ్లూ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్, భారతీయ సంవిధాన్ ప్రచారక్ దళ్, ఇండిపెండెన్స్ ఫోరం జాతీయ అధ్యక్షుడు చిన్న ధనరాజ్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శైలేందర్, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య, భారత నాస్తిక సమాజం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమా ర్, అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేశ్ కుమార్ తదితరులున్నారు.
