చదివింది నాలుగో తరగతి అయినా ఐఐటీ స్టూడెంట్‌లా ఆలోచిస్తాడు అంజద్. సిద్దిపేటలోని ఆయన షాపుకు వెళ్లి చూసిన వాళ్లు .. వావ్ అనకమానరు…ఎందుకంటే అంజద్ కొత్తగా ఆలోచిస్తాడు. డిఫరెంట్ వెహికిల్స్ తయారు చేస్తాడు. అలాగని ఒకటో రెండో తయారుచేసుంటాడు అనుకునేరు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటివరకు వందకుపైగా బుల్లి బుల్లి సైకిళ్లు, బైక్‌లు తయారుచేశాడు.
సిద్దిపేట, వెలుగు: అంజద్ పాషాది సిద్దిపేట జిల్లా చేర్యాల. బైక్ పంక్చర్ షాపు ఓనర్. ఆ షాపునే లాబరేటరీగా మార్చి బుల్లి బుల్లి బైకులు, సైకిళ్లు, డిఫరెంట్ వెహికల్స్ తయారుచేస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. తల్లి కూలీ పనిచేసేది. దాంతో మేనమామ దగ్గర పెరిగాడు. వాళ్ల అన్నయ్య దగ్గర సైకిళ్లకు పంక్చర్లు వేయడం నేర్చుకున్నాడు. పంక్చర్లు చేస్తూ పొట్ట నింపుకునేవాడు. ఒకసారి పేపర్లో ‘ఇద్దరు కలిసి ఒకే సైకిల్‌ను తొక్కడం’ చూశాడు. అంతే తాను కూడా డిఫరెంట్ మోడళ్లలో సైకిళ్లు తయారు చేయాలనుకున్నాడు. సైకిళ్లకు అవసరమైన వస్తువులను కొనేవాడు. డబ్బు కూడా బాగా ఖర్చయ్యేది. దాంతో చిన్న చిన్న విడి భాగాలను సొంతంగా తయారు చేసేవాడు. ఏడాది తర్వాత ‘ఇద్దరు తొక్కే’ సైకిల్‌ను తయారుచేశాడు. అంజద్ టాలెంట్ చూసి చాలామంది ప్రోత్సహించారు. అప్పట్నుంచి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు వంద రకాల చిన్న సైకిళ్లు, బైక్స్ తయారుచేశాడు. ప్రస్తుతం ప్రపంచలోనే అతి పెద్ద సైకిల్ తయారుచేసే పనిలో ఉన్నాడు.
సైకిళ్లపై ఇష్టంతో..
అంజద్ షాపులో ఆరంగుళాల మొదలుకొని పదిహేను అడుగుల ఎత్తైన సైకిళ్ల వరకు కనిపిస్తాయి. టీవీ మోటార్ భాగాలతో ఒక డిఫరెంట్ సైకిల్ తయారు చేశాడు. అది సైకిల్ అయినా, చూసేందుకు మాత్రం బైక్‌లా ఉంటుంది. అంజద్ దానిపై చక్కర్లు కొడుతుంటే చూసే వాళ్లంతా ఆశ్చర్యపోతారు.
ప్రమాదం జరిగినా..

ఒకసారి పదిహేను అడుగుల సైకిల్‌ను తలకిందులుగా తొక్కుతుండగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవడంతో, తొడభాగంలో ఎముక విరిగింది. ఆరు నెలలు మంచానికే పరిమితమయ్యాడు. మళ్లీ కోలుకొని ప్రయోగాల బాట పట్టాడు.
డిఫరెంట్ సైజుల్లో బైకులు, సైకిళ్లు తయారుచేస్తున్న అంజద్ టాలెంట్‌కు ‘చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గ్యాలెక్సీ బుక్ ఆఫ్ వరల్డ్రికార్డ్స్’… ఇలా ఎన్నో రికార్డులు, అవార్డులు సొంతమయ్యాయి.
ఐడెంటిటీ కోసమే..
అంజద్ తయారుచేసిన చిన్న వెహికల్స్‌ను షాపులోనే భద్రపరుచుకుంటాడు. చాలామంది ముచ్చటపడి ‘మాకు ఒకటి కావాలి.. తయారుచేసి ఇస్తావా’ అని అడుగుతుంటారు. కానీ అంజద్ మాత్రం వాటిని అమ్మడానికి ఇష్టపడడు. కేవలం ‘ఐడెంటిటీ కోసం తయారు చేస్తున్నా’ అంటాడు. సంపాదనలో సగం… సైకిళ్ల తయారీకి ఖర్చుచేస్తాడు.
