కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్​కు వెళ్లనక్కర్లే..

కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్​కు వెళ్లనక్కర్లే..
  • వర్చువల్ సిస్టమ్​తో ఇంట్లోంచే మాట్లాడేలా పుణె పోలీసుల ప్లాన్

పుణె: కరోనా ఎఫెక్టు నేపథ్యంలో సిటిజన్లు ఈజీగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా పుణె పోలీసులు సూపర్ ప్లాన్ చేస్తున్నారు. వర్చువల్ అపాయింట్‌మెంట్ సిస్టమ్​ను ప్రారంభించాలని యోచిస్తున్నారు. దీంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి ఆన్‌లైన్‌లోనే పోలీసు అధికారులతో మాట్లాడటం, ఫిర్యాదులు, పరిష్కారాలకు వీలు కల్పిస్తుంది. కరోనా హాట్​స్పాట్ సిటీ అయిన పుణెలో లాక్​డౌన్ సడలింపుల తర్వాత కేసుల పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్​లో వర్చువల్ అపాయింట్​మెంట్ సిస్టమ్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ‘‘సాధారణంగా వేధింపులు ఎదుర్కొంటున్నవారు సంబంధిత పోలీస్ స్టేషన్ ను సంప్రదిస్తారు. పోలీస్ అధికారులు అవసరమైన చర్యలు ప్రారంభిస్తారు. వైరస్ వ్యాప్తి కారణంగా పోలీసులు ప్రజల వద్దకు చేరుకోవడం కష్టమవుతోంది” అని పుణె పోలీస్ కమిషనర్ కె వెంకటేశం మీడియాతో అన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా అపాయింట్​మెంట్ తీసుకుని ప్రజలు ఫిర్యాదు గురించి పోలీసు అధికారితో మాట్లాడవచ్చునని చెప్తున్నారు. తొలుత కమిషనరేట్ లో ప్రారంభిస్తామని, సక్సెస్‌ అయితే పోలీస్ స్టేషన్ స్థాయిలో అమలు చేస్తామని అంటున్నారు.