ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ ధామి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి పీఠాన్ని నాలుగు నెలల గ్యాప్‌లోనే మూడో నేత చేపట్టనున్నారు. ఆ రాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నాయకుడు పుష్కర్ సింగ్ ధామి పేరు ఖరారైంది. ఈ మేరకు శనివారం జరిగిన మీటింగ్‌లో బీజేపీ శాసనాసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో రాష్ట్ర పదో సీఎంగా పుష్కర్ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి తీరథ్ సింగ్ రావత్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు డెహ్రాడూన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు. సీఎం రేసులో సత్పాల్ మహారాజ్, ధన్‌సింగ్ రావత్‌ల పేర్లు వినిపించినప్పటికీ అనుభవం రీత్యా పుష్కర్ ధామి వైపే అధిష్టానం మొగ్గుచూపిందని తెలుస్తోంది.

