కులం పేరిట జరిగే దోపిడీ ని అరికట్టాలి : మాజీ డీజీపీ పూర్ణ చందర్ రావు

కులం పేరిట జరిగే దోపిడీ ని అరికట్టాలి : మాజీ డీజీపీ పూర్ణ చందర్ రావు
  •     ప్రశ్నించే సాహిత్యంతోనే సామాజిక మార్పు
  •     మాజీ డీజీపీ పూర్ణచందర్​రావు

ముషీరాబాద్, వెలుగు: కులం పేరిట జరుగుతున్న దోపిడీ, వివక్షను ప్రశ్నించే సాహిత్యమే సమాజ మార్పునకు నిజమైన ఆయుధమని మాజీ డీజీపీ డాక్టర్  జె పూర్ణచందర్​రావు పేర్కొన్నారు. ఆదివారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో బీసీ కవిత భేరి ఆధ్వర్యంలో బీసీ సాహిత్యం, సామాజిక చైతన్యం అనే అంశంపై కవుల సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, రిటైర్డ్  ఐఏఎస్  టి చిరంజీవులుతో కలిసి ఆయన హాజరయ్యారు. ముందుగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యం క్రమంగా ప్రజలకు దూరమవుతోందని తెలిపారు. పల్లె పదాలు, జానపద భాష కనుమరుగవుతున్నాయని, తెలుగు మహాభారతం పేరుతో వచ్చిన రచనల్లో కూడా తెలుగు కంటే సాంస్కృతిక పదాలే ఎక్కువ కనిపిస్తున్నాయన్నారు. ప్రజల భాషను పండిత భాష మింగేసిందని చెప్పారు. 

ఒకప్పుడు పల్లెల్లో వినిపించిన పని పాటలు, జానపద గేయాలు నశించి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు ఉద్యమం తెలుగు సాహిత్యానికి కొంత శక్తిని ఇచ్చినప్పటికీ, సమాజాన్ని పట్టిపీడిస్తున్న కుల వివక్ష, కుల దోపిడీ అంశాలు ప్రధాన సాహిత్య ప్రభావంలో బలంగా ప్రతిబింబించడం లేదన్నారు. ప్రజల భాషలో మాట్లాడిన గద్దర్  వంటి కళాకారులు ప్రజల హృదయాలకు చేరువయ్యారని గుర్తు చేశారు. ఎంపీ ఆర్  కృష్ణయ్య మాట్లాడుతూ జనం మాట.. జనం పాట.. జనం బాధ.. ఇవే సాహిత్యానికి కేంద్రం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కవులు సంగెం సూర్యారావు, చెన్నా రామారావు, రిటైర్డ్  డీఈవో విజయ్ కుమార్, బడేసాబ్ పాల్గొన్నారు.