- ఇప్పటికే ముగ్గురు రిటైర్డ్ ఇంజినీర్లకు ఎక్స్టెన్షన్
- అర్హులైన అధికారులకు ప్రమోషన్ల ఇవ్వాలని
- ఆర్ అండ్ బీ శాఖ ఇంజినీర్ల సంఘం డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రోడ్డు భవనాల శాఖలో ఎస్ఈగా రిటైర్డ్ అయిన ఉద్యోగిని కాంట్రాక్ట్ పద్ధతిలో సీఈగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు రిటైర్డ్ ఇంజినీర్లకు ఎక్స్ టెన్షన్ ఇస్తూ కాంట్రాక్ట్ బేసిస్‌పై పనిచేయిస్తుండగా, తాజాగా మరో రిటైర్డ్ ఉద్యోగికి ఇదే విధమైన ఉత్తర్వులు జారీ చేయడంపై ఆర్ అండ్‌బీ శాఖ ఇంజినీర్ల సంఘం మండిపడింది. రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్టెన్షన్లు ఆపి పనిచేస్తున్న ఇంజినీర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ గురువారం ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ శాఖ హెడ్ ఆఫీస్ ఎదుట ఫ్ల కార్డులతో ధర్నా చేశారు.
రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదు..
ఆర్అండ్బీ శాఖలో రిటైర్డ్ఉద్యోగులకు ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఆర్అండ్బీ శాఖ ఈఎన్సీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని ఆ శాఖ ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. రిటైర్డ్ఉద్యోగులను కాంట్రాక్ట్పద్ధతిలో నియమించి వారికి కీలక బాధ్యతలు అప్పగించకూడదని కోరినట్లుగా వివరించారు. ఆర్ అండ్‌బీ శాఖలో రిటైర్డ్అయిన జి.రాజేశ్వర్ రెడ్డిని చీఫ్ఇంజినీర్గా సంవత్సరం, బి.వెంకటేశ్వర్రావును హ్యామ్ ప్రాజెక్ట్చీఫ్ ఇంజినీర్‌గా ఆరు నెలలు, పి.ధర్మారెడ్డిని సూపరిండెంట్ ఇంజినీర్‌గా ఏడాదిపాటు వారి పదవీకాలాన్ని పొడిగించిన ప్రభుత్వం.. మళ్లీ ఇప్పుడు గడువు ముగిసిన ధర్మారెడ్డిని మరోసారి చీఫ్ ఇంజినీర్‌గా ప్రమోట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
రిటైర్డ్‌ఉద్యోగుల సేవలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొనసాగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వల్ల రెగ్యులర్ఎంప్లాయీస్, సీనియర్ అధికారులకు ప్రమోషన్ రాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీర్ల కమిటీ, ఈఎన్సీ ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగించడం ఇంజినీరింగ్ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. ఖాళీ పోస్టులను అర్హులైన ఇన్- సర్వీస్ అధికారులతో భర్తీ చేయాలని డిమాండ్‌చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

