పీఈటీ అభ్యర్థుల ఆందోళనకు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా మెరిట్ అభ్యర్థులకు ఎందుకు పోస్టింగ్ ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అణిచి వేత పాలన కొనసాగుతోందన్నారు. ప్రజలను.. పోరాటాలను అణిచి వేయాలని చూస్తే శ్రీలంకలో ఏం జరిగిందో తెలంగాణలో కూడా అదే జరుగుతుందని హెచ్చరించారు. మెరిట్ సాధించిన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వకపోతే.. బీజేపీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛలో ప్రగతిభవన్‌కు పిలుపునిస్తామని చెప్పారు. TSPSC అధికారులు మొండి వైఖరి వీడి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
TSPSC ముందు గురుకుల పీఈటీ మెరిట్ సాధించిన అభ్యర్థులు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు. బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 2017లో గురుకుల పీఈటీ పోస్టులు సాధించామని.. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం తమకు పోస్టులు కేటాయించలేదని అభ్యర్థులు ఆరోపించారు. గతంలో కోర్టు కేసుల కారణంతో పోస్టులు కేటాయించలేదని.. ఇప్పుడు కేసులు క్లియర్ అయినా TSPSC పోస్టింగులు ఇవ్వడం లేదన్నారు. న్యాయపరంగా తమ పోస్టులు ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. TSPSC అధికారులు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. పోస్టింగులు ఇవ్వకపోతే సీఎం క్యాంపు ఆఫీసు ముందు ఆందోళన చేపడతామన్నారు.
