V6 News

బకాయిలు విడుదల చేయకుంటే..సీఎం ఆఫీస్ ముట్టడిస్తాం: ఆర్ కృష్ణయ్య

బకాయిలు విడుదల చేయకుంటే..సీఎం ఆఫీస్ ముట్టడిస్తాం: ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడటం సమంజసం కాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విద్యానగర్ బీసీ భవన్​లో జరిగిన విద్యార్థి, యువజన సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రను సహించబోమని, ఇప్పటికే ఫీజులు చెల్లించలేక, యాజమాన్యాల వేధింపులు తట్టుకోలేక 10 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. 

ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని, జిల్లాల పర్యటనకు వచ్చే మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ఉద్యమం మొదలైతే ఆపడం ఎవరి తరం కాదని, అవసరమైతే సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని కృష్ణయ్య స్పష్టం చేశారు.

ఫీజుల విషయంలో నిర్లక్ష్యం దుర్మార్గం

బషీర్​బాగ్: ఫీజు రీయింబర్స్​మెంట్ నిధులు విడుదల చేయకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడం అన్యాయమని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ మండిపడ్డారు. మంగళవారం నిజాం కాలేజీలో నిర్వహించిన అఖిలపక్ష విద్యార్థి సంఘాల సమావేశం అనంతరం నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేశారు. 

మంత్రులు, ఎమ్మెల్యేల విలాసాలకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. విద్యార్థుల ఫీజుల విషయంలో నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమన్నారు. గత మూడేండ్ల బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల సాకుతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు ఉమేశ్, వంశీ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.