V6 News

రాఘవ్ చద్దా హీరో కాదు జీరో.. బీజేపీలో చేరికపై జెన్‌జెడ్ ఫాలోవర్ల ఆగ్రహం..

రాఘవ్ చద్దా హీరో కాదు జీరో.. బీజేపీలో చేరికపై జెన్‌జెడ్ ఫాలోవర్ల ఆగ్రహం..

ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత రాఘవ్ చద్దా బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెను దుమారం రేపుతోంది. శుక్రవారం సాయంత్రం(ఏప్రిల్ 24) ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి చద్దా సోషల్ మీడియా అకౌంట్స్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. ముఖ్యంగా యువత, జెన్ జెడ్ ఫాలోవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యూత్ నుంచి భారీ నిరసన:
రాఘవ్ చద్దాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫాలోయింగ్ సామాన్యమైంది కాదు. పార్టీ మారిన గంటల వ్యవధిలోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య 14.6 మిలియన్ల నుంచి దాదాపు 13.7 మిలియన్లకు పడిపోయింది. యువత ఎక్కువగా ఉండే ఇన్‌స్టాగ్రామ్‌లో "అన్‌ఫాలో రాఘవ్ చద్దా", "హీరో టు జీరో" లాంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. సుమారు 80వేలకు పైగా నెగటివ్ రియాక్షన్లు రావడం చద్దా ఇమేజ్‌కు పెద్ద దెబ్బగా మారింది. 

జెన్ జెడ్ ఆగ్రహానికి కారణం:
అవినీతి రహిత రాజకీయాలు చేస్తారని, సామాన్యుల గొంతుకగా ఉంటారని నమ్మిన జెన్ జెడ్ యువత.. చద్దా నిర్ణయాన్ని ఒక రాజకీయ అవకాశవాదంగా అభివర్ణిస్తున్నారు. "పంజాబ్ దా గద్దర్" అంటూ ఘాటైన కామెంట్లు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ఆప్ రాజ్యసభ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది తమతో ఉన్నారని చద్దా ప్రకటించడం పట్ల రాజ్యాంగపరమైన వెసులుబాటు ఉన్నా, నైతికంగా ఇది తప్పని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.

సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ వంటి ఇతర కీలక నేతలు కూడా ఆయన వెంట బీజేపీలోకి వెళ్లడం ఆప్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా యువత ఆరాధించే ఒక యువ నాయకుడు ఇలా పార్టీ ఫిరాయించడాన్ని డిజిటల్ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. ఫాలోవర్లు తగ్గటం అనేది జస్ట్ సంఖ్యకు సంబంధించింది కాదు, అది యువతలో చద్దా కోల్పోయిన నమ్మకానికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.