అదానీ కంపెనీ పేర్లను మోదానీగా మార్చండి: ప్రధానిని ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీ

అదానీ కంపెనీ పేర్లను   మోదానీగా మార్చండి: ప్రధానిని ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీ

చండీగఢ్: ఎన్నికల్లో ఓట్లను దొంగిలించే వ్యవస్థను బీజేపీ ఏర్పాటు చేసుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్రలతో పాటు ఇటీవల బెంగాల్, అస్సాంలలో కూడా ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచిందని విమర్శించారు. లక్షలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి, కొత్త పేర్లను చేరుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్(ఈసీఐ), బ్యూరోక్రసీని గుప్పిట్లో పెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.

 ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని.. త్వరలోనే బీజేపీకి గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హర్యానా కాంగ్రెస్ నేత బ్రిజేందర్ సింగ్ చేపట్టిన సద్భావ యాత్ర..రాష్ట్రంలోని 85 నియోజకవర్గాలను చుట్టుముట్టి, సుమారు 2,700 కిలోమీటర్లు సాగింది. ఇది శుక్రవారం సాయంత్రం గురుగ్రామ్‌‌లో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని, మాట్లాడారు. 

‘‘దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు, మౌలిక సదుపాయాలు.. చివరకు నికోబార్ దీవులను కూడా అదానీకి కట్టబెడుతున్నారు. అందువల్ల అదానీ కంపెనీ పేరును ఇకపై ‘మోదానీ’గా మార్చాలి. మోదీ, అదానీ ఇద్దరూ ఒక్కటే’’ అని ఎద్దేవా చేశారు. ఇండో-యూఎస్ ట్రేడ్ డీల్ దేస  రైతులను నాశనం చేస్తుందన్న రాహుల్.. మన వ్యవసాయ రంగాన్ని అమెరికా రైతుల కోసం తెరిచారని విమర్శించారు. 

భారతీయుల డేటా, మెసేజ్‌‌లు, మెడికల్ డేటా వంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా మోదీ అమెరికాకు ఇచ్చేశారని ఆరోపించారు. ఈ ఒప్పందం వల్ల భారత్‌‌కు దక్కింది ఏమి లేదని రాహుల్ పేర్కొన్నారు.