భారత స్వయంప్రతిపత్తి ప్రమాదంలో ఉంది..అమెరికాతో ప్రధాని మోదీ రాజీపడ్డరు: రాహుల్‌ గాంధీ

భారత స్వయంప్రతిపత్తి ప్రమాదంలో ఉంది..అమెరికాతో ప్రధాని మోదీ రాజీపడ్డరు: రాహుల్‌ గాంధీ
  • రష్యా చమురు కొనుగోలుకు అమెరికా పర్మిషన్‌ ఇవ్వడంపై ఫైర్‌‌

న్యూఢిల్లీ: రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేయడానికి ఇండియాకు అమెరికా అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, జాతీయ సార్వభౌమాధికారం ప్రమాదంలో ఉన్నాయని ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా బ్లాక్ మెయిల్‌కు గురవుతున్నారని విమర్శించింది.

ఈ మేరకు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’లో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘దేశంలో ప్రస్తుత విదేశాంగ విధానం రాజీపడిన వ్యక్తి బలహీనతలను ఆసరాగా చేసుకోవడం వల్ల ఏర్పడింది. మన విదేశాంగ విధానం ప్రజల సమష్టి సంకల్పం నుంచి ఉద్భవించింది. అది మన చరిత్ర, భౌగోళిక, సత్యం, అహింస అనే ఆధ్యాత్మిక నిబద్ధతతో ఉండాలి. కానీ, ఈ రోజు మనం చూస్తున్నది రాజీపడిన బలహీనమైన వ్యక్తిని. మనం ఎవరి నుంచి చమురు కొనాలనే విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడం సిగ్గుచేటు”అని రాహుల్‌ పేర్కొన్నారు.

అమెరికా ఒత్తిడికి మోదీ లొంగిపోయారు : ఖర్గే

‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌, అదానీ కేసులో ప్రధాని మోదీ బ్లాక్‌మెయిల్‌కు గురవుతున్నారు. దీంతో దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, జాతీయ సార్వభౌమాధికారం ముప్పులో ఉన్నాయి. రష్యా చమురు కొనుగోలు చేయడానికి మనకు అమెరికా 30 రోజుల అనుమతి ఇవ్వడం చూస్తుంటే మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా వెనకడుగు వేస్తోందని స్పష్టమవుతోంది’ అని ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.